Best Horror Movies On OTT: హారర్ సినిమాలు అన్నీ దాదాపుగా ఒకే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతాయి. అందులో హారర్ ఎలిమెంట్స్‌ను ఎంత భయంకరంగా చూపించారో అనే విషయంపై వాటి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కానీ కొన్ని హారర్ చిత్రాలు మాత్రం మునుపెన్నడూ చూడని కథతో తెరకెక్కుతాయి. అలాంటి వాటిలో ఒకటి ‘స్మైల్’(Smile). మామూలుగా ఒకరి స్మైల్.. అంటే ఒకరు మనస్పూర్తిగా నవ్వడం చూస్తే ఆటోమేటిక్‌గా మనకు కూడా నవ్వొస్తుంది. కానీ అదే నవ్వు మనల్ని భయపెడితే.. చంపడానికి వెంటాడితే.. ఎలా ఉంటుంది అనేది ‘స్మైల్’ కథ. పార్కర్ ఫిన్ తెరకెక్కించిన ‘స్మైల్’ గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక సూపర్ నేచురల్ హారర్ మూవీ.
కథ..
కథ విషయానికొస్తే.. హీరోయిన్ రోజ్ కాటర్ (సోసీ బేకన్) ఒక సైకియార్టిస్ట్. ముందుగా తన దగ్గరికి ఒక పేషెంట్ వస్తాడు. అతడికి ఏమైందో తెలియదు కానీ.. తాను చనిపోతానని భయపడుతూ ఉంటాడు. తనకు ట్రీట్మెంట్ ఇవ్వాలని రోజ్ నిర్ణయించుకుంటుంది. కానీ అదే సమయంలో తన ప్రొఫెసర్ తన కళ్ల ముందే ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో మానసికంగా కృంగిపోయిన లారా వేవర్ (కేట్లీన్ స్టేసీ) అక్కడికి వస్తుంది. దీంతో ముందుగా లారాకు ట్రీట్మెంట్ ఇవ్వమని ఆసుపత్రి యాజమాన్యం రోజ్‌ను ఆదేశిస్తుంది. దాంతో రోజ్ జీవితం మలుపు తిరుగుతుంది.మానసికంగా కృంగిపోవడం వల్ల లారాకు పిచ్చి పట్టిందని అనుకుంటుంది రోజ్. తనతో మాట్లాడుతున్న సమయంలోనే రోజ్‌కు ఒక ఫోన్ వస్తుంది. తిరిగి చూసేసరికి లారా వింతగా నవ్వుతూ ఒక గాజుముక్కతో తనను తాను కట్ చేసుకొని చనిపోతుంది.
చనిపోయే ముందు కూడా లారా నవ్వుతూనే ఉంటుంది. రోజ్.. ఒక సైకియార్టిస్ట్ అయినా కూడా లారా అలా నవ్వుతూ చనిపోవడం చూసి తను భయపడుతుంది. మెల్లగా తన ప్రవర్తనలో మార్పులు రావడంతో బాయ్‌ఫ్రెండ్‌కు దూరమవుతుంది. లారా వాళ్ల ప్రొఫెసర్ ఎలా చనిపోయాడో తెలుసుకోవాలని అన్వేషణ మొదలుపెడుతుంది. ఆ క్రమంలో తనకు ఒక పోలీస్ ఆఫీసర్ (కైలీ గాల్నర్) సహాయపడతాడు. త్వరలోనే లారాలాగానే తాను కూడా చనిపోతానని రోజ్ తెలుసుకుంటుంది. అలా నవ్వుతూ చనిపోయిన వారు చివరిగా ఎవరిని చూస్తారో వాళ్లు కూడా వారం రోజుల్లో చనిపోతారని తనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ స్మైల్ నుండి లారా తప్పించుకోగదా లేదా అన్నదే తెరపై చూడాల్సిన కథ.
ముందుగా ఒక షార్ట్ ఫిల్మ్‌గా..
హారర్ సినిమాల్లో క్యారెక్టర్స్ నవ్వినా కూడా ప్రేక్షకుడికి భయం కలుగుతుంది. కానీ ‘స్మైల్’లో మాత్రం పాత్రలు నవ్విన ప్రతీసారి ప్రేక్షకుడి వెన్నులో వణుకుపుట్టడం ఖాయం. ఇక ఇందులో లారా పాత్రలో నటించిన కేట్లీన్ వింత నవ్వుతోనే సినిమా పోస్టర్‌ను తయారు చేయించాడు దర్శకుడు పార్కర్ ఫిన్. దీంతో ఈ పోస్టర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి.. సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. ముందుగా ‘లారా హ్యాజ్ నాట్ స్లీప్’ అనే పేరుతో ఇదే కథను ఒక షార్ట్ ఫిల్మ్‌గా తెరకెక్కించాడు పార్కర్. అది సూపర్ సక్సెస్ సాధించడంతో ‘స్మైల్’ అనే టైటిల్‌తో ఈ కథను ఒక ఫీచర్ ఫిల్మ్‌గా మలిచాడు.
నటనే హైలెట్..
నిజంగానే ఒక మనిషి మన ముందు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఎలా ఉంటుందో ‘స్మైల్’లో కళ్లకు కట్టినట్టుగా చూపించింది హీరోయిన్ సోసీ బేకన్. ముఖ్యంగా తను లారా లాగా చనిపోకూడదని రోజ్ పడే తపనను బాగా చూపించింది. ఈ సినిమా మొత్తంలో కొన్నే హారర్ సీన్స్ ఉన్నా.. అవి వచ్చిన ప్రతీసారి ప్రేక్షకులు షాక్ అవ్వడంతో పాటు భయపడడం కూడా ఖాయం. మెల్లగా కథ ముందుకు వెళ్తున్నప్పుడు అసలు తర్వాత ఏం జరుగుతుందో అని ఆసక్తి కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అంతే కాకుండా క్లైమాక్స్‌ను కూడా ఆసక్తికరంగా ప్లాన్ చేశాడు. ఒక డిఫరెంట్ సైకలాజికల్ హారర్ మూవీ చూడాలనుకునే ప్రేక్షకులు.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ‘స్మైల్’ను చూసేయవచ్చు.
Also Read: బిడ్డను బిర్యానీ చేసి ఊళ్లోవాళ్లకు విందుగా పెడితే? ఈ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలతో అస్సలు చూడలేరు