Blue Star Movie: తమిళ హీరోలు అశోక్‌ సెల్వన్‌, శాంతను భాగ్యరాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘బ్లూ స్టార్‌’. ఎస్. జయకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాని కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పా.రంజిత్ నిర్మించారు. రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 25న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ప్ర‌ముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదిక‌గా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకి ఓటీటీలోనూ అధ్బుతమైన స్పందన లభిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న తరుణంలో, క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా చర్చకు వచ్చింది.


క్రికెట్ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ‘బ్లూ స్టార్‌’ కూడా అదే లిస్టులో చేరుతుంది. కాకపోతే మిగతా చిత్రాలకు దీనికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇందులో క్రీడలు, క్రికెట్‌లోని కుల వివక్ష వంటి సెన్సిటివ్ ఇష్యూని టచ్ చేశారు. 1990లో తమిళనాడులోని కుంభకోణం ఊరిలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. దీంట్లో సమకాలిన రాజకీయాలతో పాటు ప్రేమ, వినోదం లాంటి కమర్షియల్‌ అంశాలను కూడా జోడించారు.


కథేంటీ?


‘బ్లూ స్టార్‌’ సినిమా కథంతా అరక్కోణంకు చెందిన రెండు క్రికెట్ జట్ల మధ్య జరిగే తీవ్రమైన పోటీ చుట్టూ తిరుగుతుంది. అందులో అట్టడుగు కులాలకు చెందిన 'కాలనీ పసంగ' టీమ్‌కు అశోక్ సెల్వన్ నాయకత్వం వహిస్తుండగా.. అగ్ర కులాలకు చెందిన సభ్యులు ఉండే జట్టుకు శాంతను భాగ్యరాజ్ కెప్టెన్‌గా ఉంటాడు. రెండు జట్ల మధ్య చిన్న చిన్న గొడవలతో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. కేవలం వారి సామాజిక స్థితి ఆధారంగా రెండు జట్ల మధ్య నెలకొన్న దీర్ఘకాల పోటీని చూపిస్తూ.. క్రమంగా సమాజంలోని ఉన్నత వర్గాల నుండి నిమ్న కులాల వారు ఎదుర్కొంటున్న వివక్షను ఆవిష్కరిస్తుంది. 


నేటి సమాజంలోని కుల, వర్గ సమస్యలను ప్రస్తావిస్తూ దర్శక నిర్మాత పా. రంజిత్ ఇప్పటికే అనేక సినిమాలు రూపొందించారు. ఇప్పుడు ‘బ్లూ స్టార్‌’ చిత్రం ద్వారా క్రీడల్లో కుల వివక్షను, వర్గ భేదాల ఇతివృత్తాన్ని సమర్థవంతంగా తెర మీదకు తీసుకొచ్చారు. చిత్ర బృందం తమ అనుభవాలను, అసమానతలను, అవమానాలను ఈ సినిమాలో చూపించారు. నేటికీ అలాంటి అసమానతలు ఉన్నాయనే విషయాన్ని ఈ చిత్రం ప్రేక్షకులకు గుర్తుచేస్తుంది. సంగీతం కూడా ఆకట్టుకుంది.


'బ్లూ స్టార్‌' సినిమాలో అశోక్‌ సెల్వన్‌, శాంతను భాగ్యరాజ్ ఇద్దరూ తమ పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిచారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఆడటం వీరిద్దరికీ కలిసొచ్చింది. ఇక ఈ చిత్రంలో కీర్తి పాండియన్‌, పృథ్వీరాజన్, భగవతి పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, లిజీ ఆంటోని, దివ్య దురైసామి, అరుణ్ బాలాజీ, రాఘవ త‌దిత‌రులు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమా తర్వాత అశోక్‌ సెల్వన్ - కీర్తి పాండియన్‌ గతేడాది సెప్టెంబ‌ర్ లో పెళ్ళి చేసుకొని రియల్ లైఫ్ కపుల్స్ గా మారిన సంగతి తెలిసిందే.


ప్రస్తుతం ఎక్కడ చూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హడావిడే కనిపిస్తోంది కాబట్టి.. క్రికెట్ అభిమానులు క్రీడా నేపథ్యంలో రూపొందిన 'బ్లూ స్టార్' సినిమాను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పటికైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేస్తారేమో చూడాలి.


Also Read: టాలీవుడ్ 2024 క్వార్టర్లీ రిపోర్ట్: చిన్న హీరోలకు పెద్ద హిట్లు, పెద్ద హీరోలకు పాట్లు - గత 3 నెలల్లో సందడి చేసిన సినిమాలివే!