Aranmanai 4 OTT: తమిళ నటుడు సుందర్ సి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'అరణ్మనై 4'. ‘అరణ్మనై’ ప్రాంచైజీలో భాగంగా ఆయన ఇప్పటికే మూడు హారర్‌, థ్రిల్లర్‌ చిత్రాలు తీసి చక్కటి విజయాలను అందుకున్నారు. తాజాగా వచ్చిన 'అరణ్మనై 4' కూడా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ హార‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ లో అందాల తారలు తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. మే 3న విడుదలైన ఈ సినిమా గత మూడు చిత్రాలను మించి సక్సెస్ అందుకుంది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన 10 రోజుల్లోనే రూ. 50 కోట్లు వసూళు చేసిన ఈ సినిమా.. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి అదుర్స్ అనిపించింది. ఈ సినిమా తెలుగులో ‘బాక్’ పేరుతో విడుదల అయ్యింది. ఇక్కడ కూడా ఫర్వాలేదు అనిపించింది.


జూన్ 21 నుంచి ఓటీటీలో 'అరణ్మనై 4'  స్ట్రీమింగ్  


ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై ఈ ఏడాది రూ.100 కోట్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన 'అరణ్మనై 4' సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను లాక్ చేసుకుంది. జూన్ 21 నుంచి హాట్‌ స్టార్‌ లో ప్రీమియర్‌ గా ప్రదర్శించబడనుంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది.  


'అరణ్మనై 4'  క‌థేంటంటే? 


శివశంకర్ (సుందర్ సి) న్యాయవాది. అతడికి చెల్లి శ్రీనిధి (తమన్నా) అంటే ప్రాణం. కానీ, ఆమె ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకుంటుంది. అప్పటి నుంచి ఆమెను కుటుంబం దూరం పెడుతుంది.  కొన్ని రోజుల‌కి చెల్లెలితో పాటు బావ ఆత్మహత్య చేసుకుంటారు. అది తెలిసి అత్తయ్య (కోవై సరళ)తో కలిసి అక్క‌డికి వెళ్తాడు. ఆ ఊరిలో పదేళ్లకు ఒకసారి జరిగే తిరునాళ్ల సమయంలో జన్మించిన వ్యక్తులను 'బాక్' అనే క్షుద్ర శక్తి చంపడానికి ప్రయత్నిస్తుందని అతడు తెలుసుకుంటాడు. తన మేనకోడలు పుట్టిన తేదీ అదే కావ‌డంతో ఆమెను కాపాడుకోవాల‌ని ప్ర‌య‌త్రిస్తాడు. ఉత్తరాదిలో క్షుద్ర శక్తి దక్షిణాదిలో గ్రామానికి ఎందుకు వచ్చింది? 'బాక్' నుంచి ప్రజలను కాపాడాలని వచ్చిన స్వామి జీ (కెజియఫ్ రామచంద్ర రాజు) ఏం చేశారు? ఆత్మగా మారిన శ్రీనిధి తన కూతురు, కొడుకును కాపాడుకోవడం కోసం ఏం చేసింది? మేనకోడల్ని కాపాడుకోవడానికి శివ శంకర్ ఏం చేశాడు? చివరకు ఆ 'బాక్' ఏమైంది? ఊరిలో అమ్మవారు ఏం చేసింది? అనేది సినిమాలో చూడాల్సిందే.  


ఇక ఈ సినిమాకు హిప్హాప్ తమిజా స్వరాలు సమకుర్చారు. సుందర్ సి భార్య ఖుష్భు సుందర్, ఎసిఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమాలో కోవై సరళ, యోగి బాబు, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, సునీల్, కెఎస్ రవికుమార్, సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.


Read Also: ఇంటి నుంచి పారిపోయి ఇండస్ట్రీకి.. ఇప్పుడు ఏకంగా ఎంపీ - కంగనా రనౌత్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు