Poacher Web Series Trailer: ఈమధ్య ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అన్నీ ఎక్కువగా రియల్ లైఫ్ ఘటనలపై, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నేరాలపై సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు తెరకెక్కించి సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి రియల్ లైఫ్ ఘటనలపై తెరకెక్కిస్తున్న సిరీస్‌లు నిజంగానే విజయం సాధిస్తున్నాయి కూడా. అదే తరహాలో అమెజాన్ ప్రైమ్‌లో మరొక సరికొత్త డాక్యుమెంటరీ విడుదలకు సిద్ధమయ్యింది. అదే ‘పోచర్’. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యి అందరినీ ఆకట్టుకుంటోంది. అడవుల్లో జరిగే నేరాలపై సిరీస్ తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
రంగంలోకి దిగిన టీమ్..
‘ఇండియాలో జరిగిన అతిపెద్ద క్రైమ్ రాకెట్ కథ’ అనే క్యాప్షన్‌తో ‘పోచర్’ ట్రైలర్‌ను విడుదల చేసింది అమెజాన్ ప్రైమ్. ఈ ట్రైలర్.. సగం హిందీలో ఉండగా.. సగం మలయాళంలో ఉంది. ‘‘కేరళలో 90ల్లో నుండి ఏనుగుల వేట జరగలేదని, ఫారెస్ట్ మినిస్టర్ వెంటనే ఈ కేసులో విచారణ జరపమన్నారు’’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. అయితే ఈ కేసును తన టీమ్‌తో ముందుకు తీసుకెళ్తానని ఫీల్డ్ డైరెక్టర్ నీల్ బెనర్జీ మాటిస్తాడు. ఈ నీల్ బెనర్జీ పాత్రలో సీనియర్ నటుడు దిబ్యేందూ భట్టాచార్య నటించారు. తన టీమ్‌లోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాలా జోగీగా నిమిషా సజయన్ కనిపించింది. ఇంటెల్ అనాలిస్ట్ అలాన్ జోసెఫ్ పాత్రలో రోషన్ మాథ్యూ నటించాడు. అలా ఏనుగులను వేటాడుతున్న వేటగాళ్లను పట్టుకోవడానికి నీల్ బెనర్జీ తన టీమ్‌తో బయలుదేరుతాడు.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో..
అడవుల్లో చాలా నేరాలు జరుగుతాయని.. అక్రమంగా చెట్లను కొట్టేయడం, ఏనుగులతో పాటు ఇతర జంతువులను వేటాడి, చంపి వాటితో వ్యాపారం చేస్తారని చాలామందికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. కానీ అది ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తారు లాంటి విషయాలు ‘పోచర్’ సిరీస్‌లో స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు రిచీ మెహ్తా. దీనిని పూర్తిగా ఒక డాక్యుమెంటరీలాగా తెరకెక్కించకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో, తెలిసిన నటీనటులను క్యాస్ట్ చేశాడు డైరెక్టర్. ఇక ఈ వెబ్ సిరీస్‌కు ఆలియా భట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో బాలీవుడ్‌లో దీనిపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ‘పోచర్’ గురించి చాలా పాజిటివ్‌గా చెప్పింది ఆలియా.
స్ట్రీమింగ్ అప్పటినుండే..
‘‘ఇలాంటి ముఖ్యమైన ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం నాకు మాత్రమే కాదు ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌కు కూడా గర్వంగా భావిస్తున్నాను. పోచర్ చూపించిన ప్రభావం చాలా పర్సనల్. ప్రస్తుతం వైల్డ్ లైఫ్‌లో జరుగుతున్న నేరాలను రిచీ చూపించిన విధానం నన్ను, మా టీమ్‌ను కదిలించింది. ఇది నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కిందని తెలిసిన తర్వాత కథ చెప్పిన పద్ధతి నన్ను కదిలించింది. అడవులపై జరుగుతున్న ఎన్నో ఘారమైన నేరాలపై ఈ సిరీస్ దృష్టిపెట్టింది. పోచర్ చాలామంది కళ్లు తెరిపిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. మనతో పాటు జీవిస్తున్న ప్రాణులపై ఎలా శ్రద్ధపెట్టాలో, ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఒక పవర్‌ఫుల్ మెసేజ్ ఇస్తుంది ఈ సిరీస్’’ అని చెప్పుకొచ్చింది ఆలియా భట్. ఇక ఈ ‘పోచర్’ సిరీస్.. ఫిబ్రవరీ 23 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది.
Also Read: 'భోళాశంకర్' నిర్మాతతో మెగాస్టార్ మరో సినిమా - దర్శకుడు ఆయనేనా?