Naslen's Gymkhana OTT Release On Sonyliv: మలయాళ రీమేక్ 'ప్రేమలు' మూవీతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యారు యంగ్ హీరో నస్లేన్. ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'జింఖానా'. ఏప్రిల్ 10న మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. అదే జోష్‌తో ఏప్రిల్ 25న తెలుగులో రీమేక్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్
ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'సోనీ లివ్' సొంతం చేసుకోగా.. ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రానికి ఖాలిద్ రహమాన్ దర్శకత్వం వహించగా.. ప్లాన్ బి మోషన్ పిక్చర్స్, రీలిస్టిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఖాలీద్ రహమాన్, జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీశ్ ప్రొడ్యూస్ చేశారు. మూవీలో నస్లేన్‌తో పాటు లక్ మన్ అవరన్, గణపతి ఎస్.పొడువల్, అనఘా రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, బేబీ జీన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విష్ణు విజయ్ మ్యూజిక్ అందించారు.
రికార్డు కలెక్షన్స్
ఈ మూవీ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు రూ.12 కోట్లతో మూవీని తెరకెక్కించగా.. ఓవరాల్‌గా రూ.56 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగులోనూ అంతే క్రేజ్‌తో మంచి కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
స్టోరీ ఏంటంటే?
కేరళ అలప్పుజాకు చెందిన ఆకతాయి కుర్రాళ్లు జోజో జాన్సన్ (నస్లేన్), డీజే జాన్ (బేబీ జీన్), షిఫాస్ అలీ (ఫ్రాంకో ఫ్రావిన్స్), షిఫాస్ అహ్మాద్ (సందీప్ ప్రదీప్), షణవాస్ (శివ హరిచరణ్), దీపక్ పణిక్కర్ (గణపతి). వీరిలో షణవాస్ మినహా మిగిలిన అందరూ పరీక్షలో ఫెయిల్ కావడంతో డిగ్రీలో ఛాన్స్ కోల్పోతారు. దీంతో స్పోర్ట్స్ కోటా ద్వారా డిగ్రీలో అడ్మిషన్స్ పొందాలని భావిస్తారు. ఇందు కోసం బాక్సింగ్‌ను ఎంచుకుంటారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న 'అలప్పుజా జింఖానా' అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటారు. వీరికి ఆంటోని జాషువా శిక్షణ ఇస్తాడు. ఈయన ట్రైనింగ్‌తో స్థానికంగా బాక్సింగ్ పోటీల్లో గెలుస్తుంది ఈ గ్యాంగ్.
అదే జోష్‌తో కేరళ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లోకి వెళ్లేందుకు జాన్సన్ గ్యాంగ్. అయితే.. ప్రొఫెషనల్ ఆటగాళ్లు ఆడే ఈ పోటీలో వారికి ఎదురైన సవాళ్లు ఏంటి?, ముందు సరదాగా తీసుకున్నా ఆ తర్వాత దాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో జరిగిన మార్పేంటి?, స్టేట్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే క్రమంలో వీరు తెలుసుకున్నదేంటి?, చివరకు విజయం సాధించారా? లేదా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.