పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన సినిమా 'భీమ్లానాయక్'. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ సంపాదించుకుంది. 


మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రీమేక్ సినిమా అయినప్పటికీ.. ఎక్కడా ఆ ఫీల్ రాకుండా కొత్త సినిమా మాదిరి రూపొందించారు. సినిమాలో పాటలు, పవన్ యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో పండాయి. దీంతో సినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా', అలానే హాట్ స్టార్ సంస్థలు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుక్కున్నట్లు తెలుస్తోంది. రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు హక్కులను అమ్మడంతో ఈ రెండూ కూడా ఓటీటీ రిలీజ్ ముందుగా చేయడానికి పోటీ పడుతున్నాయి. నిజానికి మార్చి 25న సినిమాను స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. కానీ 'ఆహా' సడెన్ గా ఒకరోజు ముందుగానే సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో.. వెంటనే హాట్ స్టార్ కూడా మార్చి 24న రిలీజ్ అంటూ పోస్టర్ వదిలింది. రిలీజ్ విషయంలో ఇంతగా పోటీపడుతున్నాయి ఈ సంస్థలు. మరి ఏ ఓటీటీ సంస్థ భారీ వ్యూస్ ను రాబడుతుందో చూడాలి!