Adipurush: దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో వాల్మీకీ లిఖించిన రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది. ఇక రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా జూలై 16 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో నేటి తరానికి తగ్గట్టుగా రూపొందించిన ఈ  రామాయణ దృశ్య కావ్యాన్ని వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే ‘ఆదిపురుష్’ విడుదలైన దగ్గర నుంచీ సినిమా గ్రాఫిక్స్ వర్క్స్ గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఊహించినంత గ్రాండ్ గా కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్కౌట్ అవ్వలేదనే టాక్ కొద్దిగా వినబడుతోంది. ముఖ్యంగా రావణుడి పాత్రను తీర్చిదిద్దిన తీరుపై దర్శకుడిపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ‘ఆదిపురుష్’ లో రావణుడి పాత్రను ఇండైరెక్ట్ గా ట్రోల్ చేసేలా ఓ పోస్ట్ చేసింది. దీంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


రావణుడి పాత్రను ట్రోల్ చేసిన ఆహా?


ఆహా ఫ్లాట్ ఫామ్ ఇటీవల ఓ కొత్త పోస్ట్ ను రిలీజ్ చేసింది. త్వరలో ఆహా ఓటీటీ  ఫ్లాట్ ఫామ్ లో ‘అర్థమయ్యిందా అరుణ్ కుమార్’ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అందులో ప్రధాన పాత్రలో కనిపించే అరుణ్ కుమార్ అనే పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్ట్ ను రిలీజ్ చేసింది ఆహా. అయితే ఆ అరుణ్ కుమార్ అనే పాత్రకు రావణుడిలా పది తలల ఉండి కంఫ్యూజన్ లో ఉన్నట్టు కనిపించింది. దానికి తోడు ఆ పోస్ట్ తో పాటు కింద ఒక నోట్ ను కూడా రాసుకొచ్చింది. ‘పది తలలు ఉన్నా గానీ అర్థం కాలేదు మన అరుణ్ కుమార్ కు కార్పోరేట్ సిస్టం ఏంటో అందులో ఉన్న కాలుక్యూలేషన్లు ఏంటో’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఇది కచ్చితంగా ‘ఆదిపురుష్’ సినిమాలో రావణుడి పాత్రను ట్రోల్ చేయడానికే ఇలా చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


‘ఆదిపురుష్’ గ్రాఫిక్స్ వర్క్స్ పై విమర్శలు..


‘ఆదిపురుష్’ సినిమా మొదటి ట్రైలర్ విడుదల చేసినప్పటి నుంచీ ఈ మూవీ కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్స్ పై విమర్శలు మొదలైయ్యాయి. మొదటి రిలీజ్ చేసిన ట్రైలర్ లో పూర్ గ్రాఫిక్స్ ఉన్నాయంటూ భారీ ఎత్తున విమర్శలు రావడంతో మొత్తం సినిమాను దాదాపు 100 కోట్లు ఖర్చు చేసి మళ్లీ గ్రాఫిక్స్ వర్క్స్ చేయించారు. దీంతో జనవరిలో విడుదల కావాల్సిన సినిమా జూన్ కు వాయిదా పడింది. ఈ సీజే వర్క్స్ బడ్జెట్ తో కలపి మూవీ బడ్జెట్ దాదాపు 500 కోట్లకు వెళ్లింది. సెంకండ్ ట్రైలర్ విడుదల చేసినప్పుడు కూడా గ్రాఫిక్స్ వర్క్స్ పై పెదవి విరిచారు ప్రేక్షకులు కానీ త్రీడీ లో విజువల్ బాగుంటుందని అనడంతో మూవీ రిలీజ్ వరకూ ఎదురు చూశారు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత కథ, కథనాలు, నటీనటుల నటన, పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగున్నా.. గ్రాఫిక్స్ మాత్రం అంతగా రాలేదనే టాక్ వచ్చింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్ప మిగతా సినిమా మెప్పించలేదనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రావణుడి పాత్రను పూర్తిగా పాడు చేశారనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో ఈ మూవీ గ్రాఫిక్స్ వర్క్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైయ్యాయి.






Read Also: 18 ఏళ్ల ‘నో కిస్’ రూల్‌ను బ్రేక్ చేసిన తమన్నా - ఈ నిర్ణయం అతడి కోసమేనట!