Dialogue King Sai Kumar Plays NTR Role In Mayasabha Series: దేశ రాజకీయ చరిత్రలోనే ఆ ఇద్దరూ ఓ సెన్సేషన్. ఇద్దరు ప్రాణ స్నేహితులు రాజకీయ బద్ధ శత్రువులుగా ఎలా మారారు? అనేదే బ్యాక్ డ్రాప్‌గా వైఎస్సార్, చంద్రబాబు పొలిటికల్ లైఫ్‌పై రూపొందిన ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ 'మయసభ'. డైరెక్టర్ దేవా కట్టా దర్శకత్వం వహించగా... ఇటీవల రిలీజ్ అయిన టీజర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
ఎన్టీఆర్ రోల్‌లో సాయి కుమార్?
ఈ సిరీస్‌లో సీనియర్ ఎన్టీఆర్ రోల్ ఎవరు చేశారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ పాత్రను డైలాగ్ కింగ్ సాయి కుమార్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ఆయన బర్త్ డే సందర్భంగా డైరెక్టర్ దేవా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'ఇక్కడ మీరు ఏ పాత్ర పోషించారో కానీ... 'తుక్కు రేగ్గొట్టారు!!!' తెలుగు ఆడియన్స్ ఆగస్ట్ 7న మీ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు.' అంటూ ట్వీట్ చేశారు. కారుపై భారీ ర్యాలీగా అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్తున్నట్లుగా ఆ పోస్టర్ ఉంది.
'ప్రస్థానం', 'ఆటోనగర్ సూర్య' తర్వాత 'మయసభ' సిరీస్ కోసం సాయికుమార్‌తో మూడోసారి పని చెయ్యడం చాలా ఎంజాయ్ చేసినట్లు దేవా కట్టా తెలిపారు. 'సాయికుమార్ గారు నిండు నూరేళ్లు ఆనందంగా ఆరోగ్యంగా మీకు నచ్చిన పాత్రలు చేస్తూ లైఫ్ ఎంజాయ్ చెయ్యాలని మీ అభిమానిగా ఆశిస్తున్నా.' దీంతో అధికారికంగా రివీల్ చేయకపోయినా... ఈ సిరీస్‌లో ఆయన సీనియర్ ఎన్టీఆర్ రోల్ చేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆయన గాంభీర్యం, డైలాగ్ డెలివరీ ఈ పాత్రకు కరెక్ట్‌గా సెట్ అవుతాయని అంటున్నారు.
చంద్రబాబు వర్సెస్ వైఎస్సార్
పొలిటికల్ లెజెండ్స్ చంద్రబాబు, వైఎస్సార్ రాజకీయ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సిరీస్ రూపొందించినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి, వైఎస్సార్ పాత్రలో చైతన్యరావు నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. డైరెక్ట్‌గా పేర్లు వాడకున్నా కాకర్ల కృష్ణమనాయుడిగా ఆది పినిశెట్టి, ఎంఎస్ రామిరెడ్డిగా చైతన్యరావు కనిపించనున్నారు.
టీజర్‌పై సోషల్ మీడియా వేదికగా కొన్ని విమర్శలు రాగా... దీనిపై డైరెక్టర్ దేవా కట్టా స్పందించారు. 'పాలిటిక్స్ ఓ గౌరవప్రదమైన పోటీ. అందరికీ అవకాశాలు కల్పించే ఓ ప్రక్రియ. ఏకీభవించని వాళ్లను అంతం చేసే ప్రతిజ్ఞ కాదు.' అంటూ ఇటీవల ట్వీట్ చేశారు.
ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్
ఈ సిరీస్‌ను హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించారు. దేవా కట్టాతో పాటు కిిరణ్ జయకుమార్ రూపొందించారు. ఆగస్ట్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.