Varsha Bollamma's Constable Kanakam Series OTT Release Date On ETVWin: ఆడియన్స్ ఇంట్రెస్ట్‌కు అనుగుణంగా ఎక్స్‌క్లూజివ్ మూవీస్, వెబ్ సిరీస్‌లతో అలరిస్తోన్న 'ఈటీవీ విన్' ఓటీటీ మరో క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్‌తో ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన 'కానిస్టేబుల్ కనకం' వెబ్ సిరీస్‌ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ సిరీస్ ఆగస్ట్ 14 నుంచి 'ఈటీవీ విన్' ఓటీటీలో అందుబాటులో ఉండనుంది. 'నిత్యం మనం చూసే పోలీస్ కాదు. సాధారణమైన కేసు కూడా కాదు. 'కానిస్టేబుల్ కనకం' అన్నింటినీ షేక్ చేయడానికి రెడీ అవుతోంది.' అంటూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. వర్ష బొల్లమ్మతో పాటు రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించగా... కోవెలమూడి సత్యసాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ సంయుక్తంగా ఈ సిరీస్ నిర్మించారు.

Also Read: టాలీవుడ్‌లోకి మరో వారసురాలు... నిర్మాతగా మురళీ మోహన్ కుమార్తె... ప్రియాంక ఎంట్రీ

స్టోరీ ఏంటంటే?

1998లో ఓ గ్రామంలో జరిగే క్రైమ్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. ఇప్పటికే 'ఫస్ట్ బుల్లెట్' అంటూ రిలీజ్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. రేపల్లె అనే మారుమూల గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. ముఖ్యంగా రాత్రి పూట అడవి గుట్ట వైపు వెళ్లే అమ్మాయిలు కనిపించకుండా పోతారు. వరుసగా కేసులు నమోదవుతుండడంతో పోలీసులు అలర్ట్ అవుతారు. రాత్రి సమయంలో అడివిగుట్ట వైపు ఎవరూ వెళ్లొద్దంటూ చాటింపు వేయిస్తారు. ఇదే టైంలో ఆ ఊరి స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరుతుంది కనకం (వర్ష బొల్లమ్మ). అమ్మాయిల మిస్సింగ్ కేసును ఆమె ఎలా సాల్వ్ చేసింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిణామాలేంటి? అనేదే స్టోరీ. ఈ సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

రిలీజ్‌కు ముందే వివాదం

అయితే, 'కానిస్టేబుల్ కనకం' సిరీస్ రిలీజ్‌‌కు ముందే వివాదం నెలకొంది. ఈ సిరీస్ ఐడియాను 'ఈటీవీ విన్' కంటే ముందుగా 'జీ5'కు చెప్పానని... ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసి ఈటీవీ విన్ ఓటీటీలో ప్రారంభించామని మేకర్స్ తెలిపారు. తమ కథను కాపీ కొట్టి 'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్' సిరీస్ రూపొందించారని ఆరోపించారు. దీనిపై కోర్టులో కేసు కూడా వేసినట్లు చెప్పారు. అయితే... తమది 100 శాతం ఒరిజినల్ సిరీస్ అని... ఇప్పటికే పలు ఒరిజినల్ సిరీస్‍లు రూపొందించామని జీ5 బిజినెస్ హెడ్ ఇటీవల వెల్లడించారు. కాపీ విమర్శలను ఆమె ఖండించారు.