Extra Ordinary Man OTT Release: ఈ మధ్య నితిన్‌కు పెద్దగా కలిసిరావడం లేదనే చెప్పాలి. వరుసగా అతడి సినిమాలన్ని ప్లాప్‌ బాట పడుతున్నాయి. 'భీష్మ' తర్వాత ఇప్పిటివరకు నితిన్‌ ఖాతాలో ఒక హిట్‌ లేదు. 'చెక్‌' అంటూ ప్రయోగం చేసినా.. అది ఆడియన్స్‌ని మెప్పించలేకపోయింది. ఆ తర్వాత 'రంగ్‌ దే'లో 'మహానటి'తో జతకట్టాడు. ఈ మూవీ యావరేజ్‌గానే నిలిచింది. దీంతో రీమేక్‌ చేసి లక్క్‌ పరీక్షించుకోవాలనుకున్నాడు. హిందీ హిట్‌ మూవీ 'అంధాధూన్'‌ రీమేక్‌గా 'మేస్ట్రో' చేశాడు. కరోనా కాలంలో ఓటీటీలో రిలీజైన ఈ సినిమా మంచి రెస్పాన్సే అందుకుంది. కానీ ఆశించిన విజయం ఇవ్వలేదు. ఇక థీయేటర్లో విడుదలైతే పరిస్థితి ఎలా ఉండేదో మరి.  కాస్తా గ్యాప్ తీసుకుని పొలిటికల్ జానర్ 'మాచర్ల నియోజకవర్గం'తో వచ్చాడు. గతేడాది రిలీజ్ అయిన ఈ మూవీ కూడా అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది. 


ఆ వెంటనే 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'తో ఫ్యాన్స్‌ని పలకరించాడు. యంగ్ సెన్సేషన్ శ్రీలీలాతో జతకట్టాడు. లక్కీ లెగ్‌గా బ్రాండ్ సంపాదించుకున్న శ్రీలీల లక్‌ కూడా నితిన్‌కు యూజ్‌ అవ్వలేకపోయింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ చిత్రం డిసెంబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైయింది. దర్శక హీరోలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకొని ప్లాప్ గా మిగిలిపోయింది. దీంతో సైలెంట్‌ థియేటర్ల నుంచి తప్పుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.


స్ట్రీమింగ్ ఆరోజు నుంచే..!


ఈ మూవీని స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్టు ఇప్పటికే హాట్ స్టార్ ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా ఇచ్చింది. కానీ రిలీజ్‌ డేట్‌ ఎప్పుడన్నది మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్‌ డేట్‌పై అధికారిక ప్రకటన ఇచ్చింది డిస్నీప్లస్‌ హట్‌స్టార్‌. 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'ను జనవరి 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్టు హాట్‌స్టార్‌ తెలిపింది. మరి థియేటర్లో ప్లాప్‌ అయినా ఈ మూవీ డిజిటల్‌ ప్లాట్‌ఫాం ఎలాంటి రెస్పాన్స్‌ అందుకుంటుందో చూడాలి. కాగా ఈ సీనిమాలో యాంగ్రీ మ్యాన్ డా. రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. సుదేవ్‌ నాయర్‌, రావు రమేశ్‌, రోహిణి, సంపత్‌ రాజా, బ్రహ్మాజీ, అజయ్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆదిత్య మూవీస్ సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్ పై సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందించారు. 






స్టోరీ ఇదే!


అభినయ్ (నితిన్) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్. తనకెంతో ప్రతిభ ఉన్నా ఇండస్ట్రీలో సరైన గుర్తింపు, గౌరవం దక్కదు. సాదాసీదాగా సాగిపోతున్న అతని జీవితంలోకి లిఖిత (శ్రీలీల) ప్రవేశిస్తుంది. ధవనవంతురాలైన ఆమెతో ప్రేమలో పడిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆమె కంపెనీలో ఐదంకెల జీతానికి ఉద్యోగంలో చేరిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక కొత్త దర్శకుడు అభి దగ్గరకొచ్చి ఒక కథ చెప్పి, తనని హీరోగా పెట్టి సినిమా తీస్తానంటాడు. దాంతో అతనిలో మళ్లీ సినీ ఆశలు చిగురిస్తాయి. అయితే ఆ కథ ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉన్న కోటియా గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్నది.