Nalgonda Police Arrested Young Couple Who Are Chain Snatchers: నల్గొండ (Nalgonda) జిల్లా మర్రిగూడ (Marriguda) పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ యువ దంపతులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సునీత అనే మహిళ మెడలోని గొలుసును బైక్ పై ఉంటూ మెరుపువేగంతో లాక్కెళ్లారు. సదరు మహిళ వెంటనే తేరుకుని కేకలు వేయగా.. స్థానికులు అప్రమత్తమై వారిని బైక్ పై వెంబడించారు. అయినా, జెట్ స్పీడుతో ఇద్దరూ పారిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు డీసీపీ దేవరకొండ 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. 


ఎలా ట్రేస్ చేశారంటే.?


యువజంట మహిళ మెడలో గొలుసు తీసుకుని మెరుపు వేగంతో బైక్ పై పరారైన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. బైక్ నెంబర్ సాయంతో ఫోన్ నెంబర్ తెలుసుకుని సిగ్నల్ ఆధారంగా చాకచక్యంగా వారిని ట్రేస్ చేశారు. తొలుత నిందితులు లవర్స్ గా భావించగా.. వారు భార్యాభర్తలని గుర్తించారు. హైదరాబాద్ లోని సంతోష్ నగర్ కు చెందిన వెంకటేష్, అతని భార్య నిందితులని గుర్తించి అరెస్ట్ చేశారు. లిఫ్ట్ పేరుతో సునీత అనే మహిళను ఎక్కించుకొని కొద్ది దూరం వెళ్లిన అనంతరం ఆమె మెడలో ఉన్న చైన్ ను లాక్కుని పారిపోయారని తెలిపారు. వ్యసనాలకు అలవాటై చోరీలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. దొంగిలించిన బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు రూపంలో మార్చుకున్నట్లు పేర్కొన్నారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేశామని.. వీరు ఇంకా ఎక్కడైనా దొంగతనాలకు పాల్పడ్డారా.? అనే దానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.


వెరైటీ చైన్ స్నాచింగ్


మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో శుక్రవారం సాయంత్రం ఇద్దరు దొంగలు వెరైటీగా చైన్ చోరీ చేశారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం, ఉషా ముళ్లపూడి ఆస్పత్రి గేట్ సమీపంలో వాకింగ్ వెళ్లిన గౌరెడ్డి సంగారెడ్డి (68) అనే వృద్ధుడి వద్ద చైన్ ను దుండగులు చాకచక్యంగా దొంగిలించారు. వృద్ధుడి ముందు బైక్ ఆపిన దుండగులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పినట్లే చెప్పి కౌగిలించుకుని 2 తులాల గొలుసును చోరీ చేశారు. వచ్చిన వారు ఎవరో.? ఏమిటో.? తెలుసుకునే లోపే గొలుసు మాయం చేశారని వృద్ధుడు వాపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


నిద్రపోతున్న మహిళ వద్ద బంగారం


అటు, తుక్కుగూడ సర్దార్ నగర్ లోనూ శుక్రవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఓ ఇంటి తలుపు కొట్టిన దొంగలు బలవంతంగా లోపలికి ప్రవేశించి.. ఒంటరిగా ఉన్న మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లారు. ఆ మహిళ కేకలు వేయడంతో గ్రామస్థులు ఒక్కసారిగా వారిని వెంబడించగా తప్పించుకుని పారిపోయారు. గ్రామంలోని సీసీ కెమెరాలో నిందితుల దృశ్యాలు రికార్డయ్యాయి. బాధిత మహిళ పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Hyderabad News: పండుగ పూట విషాదం - పతంగి ఎగరేస్తూ విద్యుత్ షాక్ తో బాలుడు మృతి