పదకొండు నంది అవార్డులు...
ఎనిమిది ఫిలింఫేర్ అవార్డులు...
ఉత్తమ సంగీత దర్శకుడిగా ఓ జాతీయ అవార్డు... 
ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డు, అంతకు ముందు హాలీవుడ్ లో క్రిటిక్ ఛాయిస్ అవార్డు, ఇప్పుడు ఆస్కార్ నామినేషన్... ప్రపంచ సినిమా వేదికపై మన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి పేరు సగర్వంగా నిలబడింది. అవార్డులే ఓ వ్యక్తి ప్రతిభకు బెంచ్ మార్క్ అయితే... కీరవాణి సాధించిన విజయాల జాబితా ఇది. 


అవార్డులు కాదు... పాటలే ప్రమాణం అంటారా? సంగీతమే స్టేజ్ క్రియేట్ చేస్తుంది అంటారా? 'నాటు నాటు...' పాటను అడగండి చెబుతుంది. ప్రపంచంలో ఎంత మంది ఆ పాటకు కాళ్లు కదిపారో!? దేశాలు లేవు... రాష్ట్రాలు లేవు... అసలు భాషలకు సంబంధమే లేకుండా సంగీత ప్రేమికులను కదిలించిన అచ్చ తెలుగు పాట 'నాటు నాటు'. 


'నాటు నాటు' పాట సృష్టికర్త కీరవాణి. తన తమ్ముడు ఎస్.ఎస్. రాజమౌళి మాస్టర్ మైండ్ కు తగ్గట్లుగా బాణీలు, బీజీఎం సృష్టించటం దగ్గర నుంచి మొదలు పెట్టి ఇప్పుడు అతనికే ఆస్కార్ నామినేషన్ బహుమతిగా ఇచ్చే స్థాయికి పెద్దన్న కీరవాణి ఎదిగిపోయారు.


చక్రవర్తి, సి. రాజమాణి లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర 1987లో మొదలైన కీరవాణి ప్రస్థానం... 1990లో 'కల్కి' అనే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించటంతో కీలక మలుపు తిరిగింది. ఆ సినిమా ఆడియో సూపర్ హిట్టయ్యి  కీరవాణికి మంచి పేరు వచ్చినా ఆ సినిమా మాత్రం ఇప్పటి వరకూ రిలీజ్ కాలేదు. ఆ తర్వాత 1990లోనే 'మనసు మమత' అనే సినిమాతో తొలిసారిగా కీరవాణి తన పేరును తెరపైన చూసుకున్నారు. అక్కడి నుంచి మొదలు... మరకతమణి వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు.
 
'క్షణ క్షణం', 'క్రిమినల్' సినిమాలు మ్యూజికల్ హిట్స్. వాటితో అప్పట్లోనే దేశ వ్యాప్తంగా కీరవాణి పేరు మోగిపోయింది. హిందీలోనూ తన బాణీలు ఆయన  వినిపించారు. 1997లో 'అన్నమయ్య' సినిమాకు గానూ, ఆ అద్భుతమైన పాటలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. 


తమ్ముడు రాజమౌళి ప్రతి సినిమాకూ ఆయనే!
'స్టూడెంట్ నెంబర్ 1'తో దర్శకుడిగా రాజమౌళి ప్రయాణం ప్రారంభమైంది. ఆ సినిమా నుంచి 'ఆర్ఆర్ఆర్' వరకు తమ్ముడి ప్రతి సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. 


Also Read : చరిత్రకు ఒక్క అడుగు దూరంలో 'నాటు నాటు' - ఆస్కార్ నామినేషన్ వచ్చిందోచ్


తమ్ముడితో చేతులు కలిపిన దగ్గరనుంచి దర్శక ధీరుడి సంగీత దర్శకుడు అంటే కీరవాణినే. ఆ బాండ్ బ్రేక్ అయ్యిందే లేదు. 'బాహుబలి'తోనే ప్రపంచ వ్యాప్తంగా అటెన్షన్ డ్రా చేసిన కీరవాణి ఆ సినిమాకు శాటర్న్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు 'RRR'తో గోల్డెన్ గ్లోబ్ దగ్గర మొదలు పెట్టి ఆస్కార్ నామినేషన్స్ వరకూ వచ్చేశారు. ఇంకొక్క అడుగు మార్చిలో జరిగే ఈవెంట్ లో ఆస్కార్ కూడా అందుకుంటే ఆ ఘనత దక్కించుకున్న తొలి ఇండియన్ సినిమాగా RRR, రెహమాన్ తర్వాత ఆ రికార్డును అందుకున్న రెండో ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి చరిత్ర సృష్టిస్తారు.


మార్చి 23, 2023న ఆస్కార్ విజేతల వివరాలు వెల్లడిస్తారు. ఆ రోజు కీరవాణి పేరు వేదికపై వినపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. 


Also Read : 'ముంబై పోలీస్'కు 'హంట్' రీమేకా? - సుధీర్ బాబు ఏం చెప్పారంటే?