బిర్యానీ దగ్గర నుంచి రోడ్ సైడ్ దొరికే ఛాట్ వరకు పచ్చి బఠానీ వేయకుండా ఉండరు. చాలా మంది వాటిని ఏరి పక్కన పెట్టేస్తారు. మంచి రంగు, రుచి కారణంగా వాటిని కొంతమంది తింటారు కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రం చాలా తక్కువగా తెలుసు. పచ్చి బఠానీలు లెగ్యూమ్ కుటుంబానికి చెందినవి. చలికాలంలో వీటిని తినడం వల్ల శరీరానికి అనేక లాభాలు చేకూరతాయి. ఇందులో విటమిన్ ఏ, బి, సి, ఇ, కె తో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. పొటాషియం, ఫైబర్, జింక్ లభించే మంచి మూలం ఇవి ఆహారం రుచిని పెంచడమే కాదు ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తాయి.


శీతాకాలంలో పచ్చి బఠానీలు తినడం వల్ల లాభాలు


☀రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ) కలిగిన ఆహారం. ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర ఎంత త్వరగా పెరుగుతుందో కొలిచే కొలమానం ఈ జీఐ. పచ్చి బఠానీలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్ ని నియంత్రణలో ఉంచుతుంది.


☀బఠానీలో విటమిన్ బి6, సి, ఫోలేట్ వంటి చర్మానికి అనుకూలమైన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. చర్మ సంరక్షణకి అవసరమైన కొల్లాజెన్, ఎలాస్టీన్ అందిస్తుంది. ఇది చర్మ సహజ తేమని నిలుపుతుంది.


☀ప్రోటీన్ లభించే ఉత్తమ మొక్కల ఆధారిత పదార్థం. జంతు ఆధారిన ప్రోటీన్లు పొందలేని వాళ్ళు ప్రోటీన్స్ పొందటం కోసం పచ్చి బఠానీలు ఎంచుకోవచ్చు.


☀కొలెస్ట్రాల్ స్థాయిలని నియంత్రిస్తుంది. ఇందులో నియాసిన్ పుష్కలంగా ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతుంది.


☀కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగరు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఆహార ఎంపిక. ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది.


☀ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యని తగ్గిస్తుంది.


☀యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


☀ఇందులోని విటమిన్ కె ఎముకలని ధృడంగా చేస్తుంది. బోలు ఎముకల వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది.


☀విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.


☀క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.


☀ఏదైనా మితంగా తింటే ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. అలాగే మితం లేకుండా తింటే అనారోగ్యాలని తీసుకొస్తుంది. అందులో పచ్చి బఠానీ కూడా ఉంది. వీటిలో యాంటీ న్యూట్రియెంట్స్ ఉన్నాయి. దీన్ని అతిగా తీసుకుంటే శరీరంలోని ఐరన్, కాల్షియం, జింక్ శోషణ తగ్గిస్తుంది. అలాగే పొట్ట ఉబ్బరం సమస్య కూడా ఇబ్బంది పెడుతుంది. అందుకే ఈ శీతాకాలంలో పచ్చి బఠానీ మితంగా తీసుకుని ఆరోగ్యంగా ఉండండి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.