విశ్వక్ సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా నటించిన సినిమా 'ఓరి దేవుడా' (Ori Devuda Telugu Movie). దీపావళి సందర్భంగా గత నెల మూడో వారంలో... అక్టోబర్ 21న థియేటర్లలో సందడి చేసింది. సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. చాలా మంది బావుందన్నారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాలకు ఓటీటీ వీక్షకుల ముందుకు తీసుకు వస్తోంది ఆహా.
Ori Devuda OTT Streaming Date : నవంబర్ 11వ తేదీ నుంచి 'ఆహా' ఓటీటీలో 'ఓరి దేవుడా' స్ట్రీమింగ్ కానుంది. గురువారం అర్ధరాత్రి నుంచి ఆహా యాప్‌లో సినిమా అందుబాటులో ఉంటుందని సినిమా యూనిట్, ఓటీటీ ప్రతినిధులు పేర్కొన్నారు. జీవితంలో సెకండ్ ఛాన్స్ వస్తే... తప్పులను సరి చేసుకునే అవకాశం వస్తే... అనేది సినిమా కాన్సెప్ట్!
తమిళంలో అశోక్ సెల్వన్, 'గురు' ఫేమ్ రితికా సింగ్ జంటగా నటించిన 'ఓ మై కడవులే' (Oh My Kadavule) సినిమాకు రీమేక్ ఇది. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు తెలుగు సినిమాకూ దర్శకత్వం వహించారు. తెలుగులో విశ్వక్ సేన్‌కు జంటగా మిథిలా పాల్కర్ (Mithila Palkar) నటించారు. హీరో స్నేహితురాలిగా, దర్శకత్వం అంటే ఆసక్తి ఉన్న అమ్మాయి పాత్రలో ఆశా భట్ నటించారు. ఇంతకు ముందు కన్నడ హీరో దర్శన్ జోడీగా నటించిన 'రాబర్ట్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆవిడకు స్ట్రెయిట్ తెలుగు చిత్రమిది.
థియేటర్లలో 'ఓరి దేవుడా' విజయం సంతోషాన్ని ఇచ్చిందని, ఇప్పుడు ఆహా ద్వారా సినిమా మరింత మందికి రీచ్ అవుతుందని ఆశిస్తున్నట్టు విశ్వక్ సేన్ తెలిపారు. ''అభినయానికి ఆస్కారమున్న పాత్రలు చేయాలని కోరుకుంటా. ఇతరులపై ఆధార పడకుండా సాగే మహిళా ప్రాధాన్య చిత్రాలు అంటే నాకు ఇష్టం. అటువంటి పాత్ర ఈ సినిమాలో చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు నా క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడీ ఆహా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ ద్వారా ప్రేక్షకులకు మా సినిమా, నా క్యారెక్టర్ మరింత దగ్గర అవుతాయని భావిస్తున్నా'' అని మిథిలా పాల్కర్ పేర్కొన్నారు.
Also Read : 'లైగర్' గాయాలు - ఎనిమిది నెలల తర్వాత
మోడ్రన్ భగవంతునిగా వెంకటేష్
తమిళ సినిమా 'ఓ మై కడవులే'లో మోడ్రన్ భగవంతుని పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) దేవుడి ఆ రోల్ చేశారు. తెలుగులో ఆ పాత్రను విక్టరీ వెంకటేష్ చేశారు. దేవుడు అనగానే కిరీటం, స్వర్గం వంటివి ఎక్స్‌పెక్ట్ చేయవద్దు. మోడ్రన్ మనిషిలా ఉంటారు. వైట్ షర్ట్, బ్లాక్ కోట్ వేసుకుని... మంచి కళ్ళజోడు పెట్టుకుని... బాస్ అన్నట్టు ఉన్నారు.
'ఓరి దేవుడా' చిత్రానికి పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, 'దిల్' రాజు నిర్మాతలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం డైలాగులు రాశారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించగా... ఎడిటర్‌గా విజయ్, సినిమాటోగ్రాఫర్‌గా విదు అయ్యన్న బాధ్యతలు నిర్వర్తించారు.
Vishwak Sen Upcoming Movies : ప్రస్తుతం విశ్వక్ సేన్ చేస్తున్న సినిమాలకు వస్తే... 'ధమ్కీ' సెట్స్ మీద ఉంది. అందులో ఆయనే హీరో. దర్శకత్వం కూడా ఆయనే చేస్తున్నారు. తొలుత 'పాగల్' దర్శకుడు నరేష్ కుప్పిలితో సినిమా స్టార్ట్ చేసినా... కొన్ని రోజుల తర్వాత విశ్వక్ సేన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమాకు పూజ చేసినప్పటికీ... దర్శకుడు, హీరో మధ్య మనస్పర్థలు రావడంతో మధ్యలో ఆగింది. వేరే హీరోతో సినిమా చేయడానికి అర్జున్ రెడీ అయ్యారు.