'అమ్మ... ఆవకాయ్... అంజలి... ఎప్పటికీ బోర్ కొట్టవు' అనేది 'నువ్వే నువ్వే'లో ఓ మాట. 'అమ్మ... ఆవకాయ్... అంజలితో పాటు ఆ సినిమా (నువ్వే నువ్వే) కూడా ఎప్పటికీ బోర్ కొట్టదు' అనేది త్రివిక్రమ్ అభిమానులు చెప్పే మాట. ఆ అభిమానం మాటల్లో మాత్రమే కాదు... థియేటర్ల దగ్గర వసూళ్లలో కూడా కనిపించింది. 


మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు (Trivikram Srinivas Birthday) ఈ సోమవారం (నవంబర్ 7న). ఈ సందర్భంగా శుక్రవారం (నవంబర్ 4న) ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా 'నువ్వే నువ్వే'ను రీ రిలీజ్ చేశారు. 20 ఏళ్ళ తర్వాత విడుదలైనా సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 


ఎనిమిది నుంచి 35 ప్లస్ వరకు!
Nuvve Nuvve Re Release Theatre Count : శుక్రవారం 'నువ్వే నువ్వే' షోస్ చాలా తక్కువ వేశారు. తెలంగాణ, ఏపీలో ఎనిమిది షోలు వేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో పీవీఆర్ నెక్స్ట్ గాలేరియా మాల్‌లో ఫ్రైడే నైట్ 10.55 గంటలకు షో వేయగా... హౌస్ ఫుల్ అయ్యింది. కూకట్‌పల్లి విశ్వనాథ్ థియేటర్లో 23,225 రూపాయల గ్రాస్ వచ్చింది. ఆల్మోస్ట్ రెండు రాష్ట్రాల్లో అన్ని షోస్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఎనిమిది షోలకు 90 వేల గ్రాస్ లభించింది. దాంతో రెండో రోజుకు షోస్ పెంచారు. 


శుక్రవారం ఏడెనిమిది కొత్త సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో కొన్ని మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయినప్పటికీ... 'నువ్వే నువ్వే' చూడటానికి ప్రేక్షకులు వచ్చారు. సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. దీని బట్టి సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం థియేటర్స్ దగ్గర స్పందన బావుండటంతో శనివారం మరిన్ని థియేటర్లలో షోలు వేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఈ రోజు 35కు పైగా షోలు ప్లాన్ చేశారు. విశ్వనాథ్, మూసాపేట్ లక్ష్మీకళ థియేటర్లలో సెకండ్ షోస్ కన్ఫర్మ్ అయ్యాయి.  


నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టిన రోజు (Trivikram Birthday) సందర్భంగా గురూజీ అభిమానులకు శ్రీ స్రవంతి మూవీస్ ఇచ్చిన కనుక అభిమానులకు నచ్చింది. త్రివిక్రమ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించింది. ఈ నెల 7వ తేదీ వరకు 'నువ్వే నువ్వే' షోలు ప్లాన్ చేశారు. ప్రజెంట్ రెస్పాన్స్ చూస్తే పదో తేదీ వరకు షోస్ వేసేలా ఉన్నారు.  


Also Read : రజనీకాంత్ 'లాల్ సలామ్' - అమ్మాయి దర్శకత్వంలో...
   
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ను దర్శకునిగా  పరిచయం చేస్తూ... ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ 'నువ్వే నువ్వే' చిత్రాన్ని నిర్మించారు. ఇందులో తరుణ్, శ్రియ శరణ్ (Shriya Saran) జంటగా నటించారు. అక్టోబర్ 10కి సినిమా విడుదలై 20 ఏళ్ళు పూర్తయింది. 


ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించిన 'నువ్వే నువ్వే' చిత్రానికి కోటి సంగీతం అందించారు. హరి అనుమోలు ఛాయాగ్రాహకుడు. ఇప్పటికీ 'నువ్వే నువ్వే'లో పాటలు ఎక్కడో ఒక చోట అభిమానుల నోట వినిపిస్తూ ఉంటాయి.