ఈ సంవత్సరం వస్తున్న మోస్ట్ అవైటెడ్ తెలుగు సినిమాల్లో రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. దసరా సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు ‘టైగర్ నాగేశ్వరరావు’ రానుంది. ఈ సినిమాలో రవితేజ సరసన ఇటీవలే నేషనల్ అవార్డు పొందిన కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ నటించనున్నారు. ‘సారా’ పాత్రలో నుపుర్ కనిపించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించారు.


2014లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో కృతి సనన్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మెల్లగా ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారారు. 2021లో వచ్చిన ‘మిమి’ సినిమాకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు నుపుర్ సనన్ కూడా తెలుగు సినిమాతో బిగ్ స్క్రీన్‌కు మొదటిసారి పరిచయం అవుతున్నారు. దీనికి ముందు నుపుర్ సనన్ ఒకట్రెండు మ్యూజిక్ వీడియోలు, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘పాప్ కౌన్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. బిగ్ స్క్రీన్‌పై ఏ ఇండస్ట్రీలో అయినా తనకు ఇదే తొలి సినిమా.


ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే... రైలు బోగీలో నుంచి తల బయటకు పెట్టి చూస్తున్న నుపుర్‌ను పోస్టర్‌లో చూపించారు. టైగర్ నాగేశ్వరరావు ప్రేమించే అమ్మాయి అంటూ ఈ పోస్టర్ క్యాప్షన్‌లో రాశారు. నుపుర్ సనన్ ఫస్ట్‌లుక్‌ను కృతి సనన్ విడుదల చేశారు. పాన్ ఇండియా సినిమా కాబట్టి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పోస్టర్లను విడుదల చేశారు. చెల్లెలి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నందుకు తాను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నట్లు కృతి సనన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.






‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ కూడా ఇప్పటికే విడుదల అయింది. తన కెరీర్‌లో రవితేజ ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. అలాగే పవర్ ఫుల్ రోల్స్ కూడా చేశారు. కానీ స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు పాత్రలో ఆయన గెటప్, లుక్ చాలా కొత్తగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఆయన ఆహార్యం చాలా పవర్ ఫుల్‌గా ఉంది. గజదొంగ టైగర్ నాగేశ్వరరావును ఆంధ్రా రాబిన్ హుడ్ అని కొందరు అంటుంటారు.


టీజర్‌లో ‘నాగేశ్వరరావు రాజకీయాల్లోకి వెళ్లి ఉంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్స్ గెలిచేవాడు. స్పోర్ట్స్ లోకి వెళ్లి ఉంటే వాడి పరుగుతో ఇండియాకు మెడల్ గెలిచేవాడు. అదే ఆర్మీలోకి వెళ్లి ఉంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. కానీ దురదృష్టవశాత్తూ వాడు ఒక క్రిమినల్ అయ్యాడు. ఎనిమిది సంవత్సరాల వయసుకే వాడు రక్తం తాగడం మొదలు పెట్టాడు.’ అని మురళీ శర్మ చెప్పే డైలాగ్ కానీ హీరోయిజాన్ని చూపించింది. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial