Devara Look: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. దీనికి ‘దేవర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ అన్ని భాషల్లోనూ ‘దేవర’ టైటిల్‌తోనే ఈ సినిమా విడుదల కానుంది. 2024 ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ‘దేవర’ను రిలీజ్ చేయనున్నారు.
టైటిల్‌తో పాటు సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా అధికారికంగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో చేతిలో కత్తి, ఒంటి నిండా రక్తంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ను చూడవచ్చు. ఆర్ఆర్ఆర్ కంటే కొంచెం పొడవైన జుట్టుతో ఎన్టీఆర్ ఇందులో కనిపించనున్నారు. వెనుక పడవలో శవాల గుట్టను చూస్తే వయొలెంట్ యాక్షన్ సినిమాగా ‘దేవర’ తెరకెక్కనుందని తెలుస్తోంది. మొత్తంగా ఈ మాస్ ఫస్ట్‌లుక్‌తో ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం.
జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా. ఇక మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్‌కు కూడా ఇదే మొదటి స్ట్రయిట్ తెలుగు సినిమా. సైఫ్ అలీ ఖాన్‌కు జోడిగా ప్రముఖ టీవీ నటి చైత్ర రాయ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ప్రకాష్ రాజ్ కూడా మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా టెక్నీషియన్ల విషయంలో కూడా నిర్మాతలు ఎక్కడా రాజీ పడటం లేదు. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ ‘దేవర’కు సంగీతం అందిస్తున్నారు. గత సంవత్సరం విడుదలైన మోషన్ పోస్టర్‌కు అనిరుథ్ అందించిన ‘వస్తున్నా’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాతీయ అవార్డు అందుకున్న ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లకు పని చేసిన సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్, ఆక్వామ్యాన్ వంటి సినిమాలకు పని చేసిన బ్రాడ్ మినిచ్ వీఎఫ్ఎక్స్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
‘NTR30’ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకుంది. ఇవాళ్టి(సోమవారం) నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో మరో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో భాగంగా ఎన్టీఆర్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది.
రక్తం రుచి మరిగిన మృగాళ్లను వేటాడే మగాడి పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారని చెప్పి దర్శకుడు కొరటాల శివ సినిమాపై అంచనాలు మరింత పెంచేశారు. ఎన్టీఆర్ 30 చిత్రీకరణ ఇలా మొదలైందో? లేదో? అలా లీకుల బెడద మొదలైంది. ఆల్రెడీ సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫోటోలు, బ్లడ్ ట్యాంక్స్ ఫోటోలు లీక్ అయ్యాయి.