కొన్ని రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్ లో ఎన్టీఆర్ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోబోతున్నట్లు మాటలు వినిపించాయి. ఇదివరకెప్పుడూ కూడా ఎన్టీఆర్ ఇలాంటి దీక్షలు చేయలేదు. ఆయన హనుమాన్ దీక్ష చేయబోతున్నారనే వార్త రాగానే అది బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఆయన హనుమాన్ దీక్షలో ఉన్న ఫొటో ఒకటి బయటకు రావడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. హనుమాన్ జయంతి రోజు ఆయన ఆంజనేయ దీక్ష తీసుకున్నారని తెలుస్తోంది.
కాషాయ వస్త్రాలు ధరించి మాలలో కనిపించారు ఎన్టీఆర్. మెడలో మాల, నుదిటి కుంకుమ పెట్టుకున్నారు. మొదటిసారి ఎన్టీఆర్ ను ఇలా చూసిన అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ హనుమాన్ దీక్ష 21 రోజుల పాటు ఉంటుందని తెలుస్తోంది. దీన్ని ఎన్టీఆర్ ఎంతో నియమ నిబంధనలతో పూర్తిచేయనున్నారని తెలుస్తోంది. ఈ దీక్ష పూర్తయిన వెంటనే తన కొత్త సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు ఎన్టీఆర్.
ఇటీవలే ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ తరువాత రామ్ చరణ్ అయ్యప్పమాల వేయగా.. ఇప్పుడు ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్నారు. త్వరలోనే ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. రాజకీయాలు, స్టూడెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం.
Also Read: 'ఆచార్య' ప్రీరిలీజ్ ఈవెంట్ - ఎప్పుడు? ఎక్కడ?