సౌత్ సినిమా ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది నిత్యామీనన్. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ.. కేవలం తన నటనతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. ఈ మధ్యకాలంలో ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. చివరిగా 'భీమ్లానాయక్' సినిమాలో కనిపించింది నిత్యా. అలానే 'ఇండియన్ ఐడల్ తెలుగు' షోకి జడ్జిగా వ్యవహరించింది.


రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన 'మోడర్న్ లవ్ హైదరాబాద్' అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా ఈ బ్యూటీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈమె పెళ్లి చేసుకోబోతుందని.. అది కూడా ఓ మలయాళ హీరోతో అంటూ కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఈ పెళ్లి వార్తలపై స్పందించింది ఈ బ్యూటీ. 


సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది నిత్యా. అందులో తన పెళ్లి గురించి వస్తోన్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. ఇప్పట్లో తనకు పెళ్లి ఆలోచన లేదని వెల్లడించింది. ఎవరో ఒకరు ఇలాంటి పుకారు సృష్టిస్తే.. మీడియా నిజం తెలుసుకోకుండా వార్తలు ప్రచురించిందంటూ చెప్పుకొచ్చింది నిత్యా. తన కెరీర్ లో గ్యాప్స్ తీసుకుంటూ ఉంటానని.. నటులకు ఇలాంటి బ్రేక్స్ అవసరమని.. అంతేకానీ పెళ్లి కోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదని తెలిపింది. ఇప్పటికే ఐదు ప్రాజెక్ట్స్ పూర్తి చేశానని.. త్వరలోనే అవి రిలీజ్ కాబోతున్నాయని చెప్పింది.