గతేడాది 'చెక్', 'రంగ్ దే', 'మ్యాస్ట్రో' వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్.. ప్రస్తుతం 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో నితిన్ నటిస్తున్నారు. గుంటూరు కలెక్టర్‌గా హీరో కనిపించనున్నారు. సినిమాలో హీరో పేరు ఎన్. సిద్దార్థ్ రెడ్డి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, చిన్న టీజర్ ను విడుదల చేశారు. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను నితిన్ తన సొంత బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు.
నిజానికి సొంత బ్యానర్ అనగానే హీరోలు కాస్త పొదుపుగా వ్యవహరిస్తుంటారు. వీలైనంత తక్కువలో సినిమాలు చేయాలనుకుంటారు. కానీ నితిన్ సినిమా విషయంలో అది రివర్స్ అయింది. ముందు అనుకున్న బడ్జెట్ కంటే 30 శాతం ఖర్చు పెరిగిపోయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని సీన్లలో బెటర్ మెంట్ కోసం రీషూట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్ అదుపు తప్పిందని తెలుస్తోంది.
ఈ సినిమాపై నితిన్ చాలా నమ్మకాలూ పెట్టుకున్నారు. సొంత బ్యానర్ లో వస్తోన్న సినిమా కావడంతో ఇంకాస్త కేర్ పెరిగింది. అందుకే బడ్జెట్ పెరిగినా.. నితిన్ చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని టాక్. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి. ఓ యువ కలెక్టర్ ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది.
పక్కా మాస్, కమర్షియల్ అంశాలతో కూడిన కథలో నితిన్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటివరకు ఆయన ఎడిటర్ గా కొన్ని సినిమాలు చేశారు. ఇక ఈ సినిమాలో కేథరిన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.