మోడ్రన్ రామాయణంగా రూపొందిన ‘ఆదిపురుష్‘ చిత్రం సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రభాస్ మేనియాతో సినిమా హాళ్లు మార్మోగుతున్నాయి. రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన ‘ఆదిపురుష్‘ చిత్రంలో ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. రెట్రో ఫైల్స్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సుమారు రూ.550 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. ఉదయం నుంచే పలు చోట్ల స్పెషల్ షోలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాను చూసిన ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
రావణుడి గెటప్ పై నెటిజన్ల సెటైర్లు
‘ఆదిపురుష్‘ చిత్రంపై ఓ రేంజిలో అంచనాలు పెట్టుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలోని పలు పోరాట సన్నివేశాలు కార్టూన్ చానెల్స్ లో ప్రసారం అయ్యే సీన్ల మాదిరిగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ సినిమాలో రావణుడి పాత్రపై నెటిజన్లు ఓ రేంజిలో ట్రోలింగ్ కు దిగుతున్నారు. రావణుడికి ఉన్న తలలను చూసి ఇదేం లుక్ రా బాబోయ్ అనుకుంటున్నారు. గతంలో ఉన్న రావణుడి ఫోటోలను ‘ఆదిపురుష్’ రావణుడితో పోల్చుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదేనా రూ. 600 కోట్ల పనితనం? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు, రావణుడికి పెట్టిన హెయిర్ స్టైల్ మీద కూడా విమర్శలు వస్తున్నాయి. టీమిండియా క్రికెటర్ కోహ్లీ హెయిర్ స్టైల్ ను కాపీ చేసి రావణుడికి పెట్టారంటూ సటైర్లు విసురుతున్నారు. థర్డ్ క్లాస్ వీఎఫ్ఎక్స్ అంటూ విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ట్రైలర్ విడుదలైన నాటి నుంచి రావణుడి గెటప్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సినిమా విడుదలయ్యాక మరింత ట్రోలింగ్ నడుస్తోంది.
‘ఆదిపురుష్‘ పై మిశ్రమ స్పందన
ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సినిమా అత్యద్భుతంగా ఉందని కొందరు చెప్తుంటే, మరికొంత మంది మాత్రం యావరేజ్ అని కామెంట్స్ పెడుతున్నారు. సినిమాలో ప్రభాస్, కృతి సనన్ నటన హైలెట్ గా నిలువగా, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదనే టాక్ వినిపిస్తోంది. తొలి రోజు ఈ చిత్రం రూ. 100 కోట్లు వసూళు చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read Also: ఆ డైలాగ్ తీసేస్తేనే విడుదలకు అనుమతిస్తాం, ఆ దేశంలో ‘ఆదిపురుష్‘పై ఆంక్షలు