రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్‘. ప్రభాస్ హీరోగా, కృతిసనన్ హీరోయిన్ గా  బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్  ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

   రెట్రో ఫైల్స్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సుమారు రూ.550 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందించారు.  కేవలం నార్త్ లోనే సుమారు రూ.2 కోట్ల రూపాయల గ్రాస్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. ఉదయం నుంచే పలు చోట్ల స్పెషల్ షోలు కొనసాగుతున్నాయి.   ఈ సినిమాను చూసిన ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంత మంది అద్భుతం అంటే, మరికొంత మంది ఫర్వాలేదు అంటున్నారు.  


ఆ డైలాగ్ పై నేపాల్ సెన్సార్ బోర్డు అభ్యంతరం


పౌరాణిక మాగ్నమ్ ఓపస్ ‘ఆదిపురుష్’ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే, నేపాల్ సెన్సార్ బోర్టు నుంచి ఈ సినిమాకు ఓ వింత అనుభవం ఎదురయ్యింది. ఇంతకీ ఈ సినిమా పట్ల నేపాల్ సెన్సార్ బోర్డుకు ఉన్న అభ్యంతరం ఏంటి? దాన్ని చిత్రబృందం ఎలా పరిష్కరించుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ సినిమాను సెన్సార్ చేసే సమయంలో అక్కడి సెన్సార్ బోర్డు సభ్యులు ఓ డైలాగ్ పై అభ్యంతరం చెప్పారట.  నేపాల్ సెన్సార్ ప్యానెల్ స్థానిక నమ్మకం ప్రకారం, సీతాదేవి నేపాల్‌లో జన్మించిందని భావిస్తున్నారట.  అయితే, ఈ చిత్రంలో సీతాదేవి భారతదేశపు కుమార్తెగా అభివర్ణించే ఓ నిర్దిష్ట సన్నివేశంపై నేపాల్ సెన్సార్ ప్యానెల్ అభ్యంతరం వ్యక్తం చేసిందట. మేకర్స్ కచ్చితంగా ఈ డైలాగ్‌ను తొలగించాలని సూచించిందట. లేదంటే సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వబోమని తేల్చి చెప్పిందట.   


డైలాగ్ తొలగింపుకు చిత్రబృందం అంగీకారం


ముఖ్యమైన సన్నివేశంలో డైలాగ్ తొలగించేందుకు సినిమా యూనిట్ కాస్త వెనుకడుగు వేసినా, తీసేస్తేనే సినిమా విడుదలవుతుందని సెన్సార్ సభ్యులు తేల్చి చెప్పడంతో వెనక్కి తగ్గక తప్పలేదట. చివరకు ఆ డైలాగ్ తీసేస్తామని చిత్రబృందం చెప్పడంతో  సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చారట. సినిమా విడుదలకు ఉన్న అభ్యంతరాలు పూర్తిగా తొలగిపోయాయట. ఇవాళ నేపాల్ లోనూ ఈ సినిమా విడుదలైంది. భారత్ లో మాదిరిగానే అక్కడ కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లలో సందడి చేస్తోంది.


ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సినిమా అత్యద్భుతంగా ఉందని కొందరు చెప్తుంటే, మరికొంత మంది మాత్రం యావరేజ్ అని కామెంట్స్ పెడుతున్నారు. సినిమాలో ప్రభాస్, కృతి సనన్ నటన హైలెట్ గా నిలువగా, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదనే టాక్ వినిపిస్తోంది. తొలి రోజు ఈ చిత్రం రూ. 100 కోట్లు వసూళు చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Read Also: ‘ఆదిపురుష్’ ఆడియన్స్ రివ్యూ - ప్రభాస్ రాముడిగా మెప్పించాడా? మూవీ చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు?