ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ ప్రజలకు మరో వెసులుబాటు కల్పిస్తోంది. పాత కొత్త సినిమాలు చూసేందుకు ఓ యాప్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే లేటెస్ట్ సినిమాలు రిలీజ్‌ రోజునే ఇంట్లో కూర్చొని చూసుకునేలా చేశారు. ఇప్పుడు దానికి మరింత అడ్వాన్స్‌డ్‌గా ప్లాన్ చేస్తున్నారు. 
ఇప్పుడున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ మాదిరిగానే కొత్త యాప్‌కు శ్రీకారం చుట్టబోతున్నట్టు ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) ఛైర్మన్‌ గౌతం రెడ్డి చెప్పారు. ఈ యాప్‌ ద్వారా పాత, కొత్త సినిమాలు చూడవచ్చని పేర్కొన్నారు. ఈ మధ్య విశాఖలో నిరీక్షణ అనే సినిమా థియేటర్‌లో రిలీజ్‌ అయిన రోజే ఇంట్లో కూర్చొని చూసే అవకాశం కల్పించారు. కొత్త సినిమాను ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసేయొచ్చు. దీనికి మంచి స్పందన వచ్చిందని తెలిపారు.


ఫస్ట్‌డే ఫస్ట్‌ షోకు మంచి స్పందన వస్తున్నందున ఇప్పుడు రెండో సినిమా కూడా ఇలా విడుదల రోజే ఫైబర్‌నెట్‌లో వేయబోతున్నారు. ఇవాళ లవ్‌ యూ టూ అనే సినిమాను అందిస్తున్నారు. కేవలం 39 రూపాయలకే కొత్త సినిమాను ఇంటిల్లపాది చూడవచ్చు. ఒకసారి బుక్ చేసుకుంటే 24 గంటల్లో ఎప్పుడైనా ఆ సినిమాను చూడవచ్చు. 


చిన్ని చిత్రాలను ప్రోత్సహించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని గౌతంరెడ్డి అన్నారు. అదే టైంలో థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడలేని ప్రేక్షకులకు తక్కువ ధరకే కొత్త సినిమాలు చూశామన్న ఆనందాన్నికూడా అందిస్తున్నామన్నారు. ఇప్పుడు తాము తీసుకున్న నిర్ణయం థియేటర్లకు, ఓటీటీ వాళ్లకు అసలు పోటీయే కాదన్నారు. ఇది కేవలం సర్వీస్ మాత్రమేనని అన్నారు. భవిష్యత్‌లో థియేటర్‌లో వేసే ప్రతి సినిమా కూడా ఫైబర్‌ నెట్‌ వినియోగదారులు వీక్షించేలా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.