ఒక్కొక్కటి కాదు.. ఒకే సారి వంద జియో టవర్లను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.  మారుమూల ప్రాంతాలకు 4జి సేవలు, అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా  100  జియో టవర్స్‌ను వర్చువల్‌ పద్దతిలో ప్రారంభోత్సవం చేశారు.


4జీ సేవలను ప్రారంభించిన సీఎం జగన్...
ఆంధ్రప్రదేశ్ లో  మారుమూల ప్రాంతాలకు  4జీ సేవలు అందిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  ఒకేసారి 100 జియో టవర్లను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 209 మారుమూల ప్రాంతాల గ్రామాలకు ఇంటర్ నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు,  వైయస్సార్‌ జిల్లాలో 2 టవర్లను జగన్ ప్రారంభించారు. ఈ  టవర్లను  రిలయెన్స్‌ సంస్థ ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో 5జీ సేవలను అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు జియో సంస్ద వెల్లడించింది.  టవర్లు ఏర్పాటు కారణంగా మారుమూల ప్రాంతాల్లో మరింతగా మెరుగుపడనున్న ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ మరింత కనెక్టివిటీ, మెరుగైన నాణ్యతతో సేవలు అందుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


మరింత వేగంగా సేవలు...
నూతన సెల్ టవర్లను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా విద్యార్థులకు అవసరం అయిన ఇ– లెర్నింగ్‌ కు ఇబ్బంది లేకుండా ఇంటర్ నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు ఆరోగ్య సేవలు కూడ మరింత వేగవంతం అవుతాయని, ఆర్థికంగా ఆయా ప్రాంతాలకు మరింత లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.  మొబైల్, ఇంటర్నెట్‌ సర్వీసులు ద్వారా  మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకూ వారి ముంగిటకే సేవలు అందించడానికి చర్యలు  తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంట్లో భాగంగా యూనివర్సిల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) ద్వారా సెల్‌ టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని జగన్ సర్కార్ చేపట్టింది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన సెల్‌ టవర్ల పరిధిలో 150 ఎంబీపీఎస్‌ డౌన్లోడ్, 50 ఎంబీపీఎస్‌ అప్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలతో మాట్లాడి,  మార్గదర్శకాలను సులభతరం చేసుకుని, సెల్‌టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సర్కార్ భావిస్తుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.


ముఖ్యమంత్రి వీడియో సమావేశం...
కొత్తగా ప్రారంభించిన సెల్‌ టవర్ల పరిధిలో ఉన్న ప్రజా నీకంతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వార ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు,  గిరిజనులతో  ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడారు.  డిసెంబరు నాటికి రాష్ట్రంలో సెల్‌ సర్వీసులు లేని నివాసాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీతో పాటు పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయని జగన్ అన్నారు. దీంతో అన్ని సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, స్కూళ్లకూ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లభిస్తుందని, రేషన్‌ పంపిణీ, ఇ–క్రాప్‌ బుకింగ్‌ కూడా సులభమవుతుందన్నారు. ప్రభుత్వం  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును అత్యంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా అందరికి అందించగలమని అన్నారు.