పట్టపగలు ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 25 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వేసవి సీజన్ లో చోరీలు జరగటం పరిపాటిగా మారింది.. వరుస సెలవులతో ఇళ్ళకు తాళాలు వేసుకొని యాత్రలకు, బంధువుల ఇళ్ళకు వెకేషన్స్ కు వెళ్ళిన వారి ఇంటిని టార్గెట్ గా చేసుకొని దొంగలు చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన చోరీకి సంబంధించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పాత నేరస్తులే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారిని అరెస్టు చేశామని విజయవాడ డీసీపీ అజిత వేజెండ్ల తెలిపారు.


పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో...


విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిదిలోని నిడమానూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పక్క వీధిలో ని తన బంధువుల ఇంటికి గృహ ప్రవేశం నిమిత్తం వెళ్లారు.  శుభకార్యం అనంతరం ఇంటికి తిరిగి వచ్చే సరికి  ఇంటి వెనుక తలుపులు  తెరిచి ఉన్నట్లు గుర్తించారు. బీరువా తాళాలు తీసి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. బీరువాలో ఉన్న  నగదు పెద్ద ఎత్తున బంగారం దొంగలు అపహరించుకుపోయారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువా తాళాలు అందుబాటులో ఉండడంతో నిందితులు బీరువా తాళాలు తెరిచి సొత్తును చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. 


సీసీటీవీ కెమేరాలే ఆధారంగా నిందితుల అరెస్ట్..


సీసీటీవీ ఫుటేజీతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా పాత నేరస్తులు అనుమానితుల కదలికలపై నిఘా ఉంచారు. దర్యాప్తు బృందాలకు పక్కాగా అందిన సమాచారం ప్రకారం ఎనికేపాడు లోని ఓ ఇంట్లో అనుమానితులు ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లు రుజువు అయింది. నిందితుల నుండి 25 లక్షల రూపాయల విలువైన సుమారు 390 గ్రాముల బంగారు ఆభరణాలు, చోరీకి ఉపయోగించిన ఐదు మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు.


పాత నేరస్తుల చిట్టా ఇదే..


నిందితులు ఈ చోరీతో పాటు గతంలో ఏలూరు, పశ్చిమగోదావరి,  తూర్పుగోదావరి,  ఎన్టీఆర్ జిల్లా లో పగటిపూట అనేక చోరీలు చేయడమే కాక ద్విచక్ర వాహనాలను కూడా   అపహరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులంతా పాత నేరస్తులేనని చెడు అలవాట్లకు బానిసలై జల్సాల కోసం అనేక దొంగతనాలు చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చారని డిసిపి రజిత తెలిపారు. జైలు నుండి విడుదలైన అనంతరం కూడా వారు ప్రవర్తన మార్చుకోకుండా ఎనికేపాడులో ఇల్లు అద్దెకు తీసుకుని తిరిగి చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారని, ఆ క్రమంలోనే నిడమానూరులోని తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారని ఆమె తెలియజేశారు. తాళం వేసిన ఇళ్లను గుర్తించి పట్టపగలు చోరీ చేయడం ఈ ముఠా ప్రత్యేకంగా పోలీసులు వెల్లడించారు.