టాప్  ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్ గతంలో ఎన్నడూ లేని సరికొత్త ఫ్లాన్ ను ప్రకటించింది. ‘బేసిక్ విత్ యాడ్స్’ అనే పేరుతో సరికొత్త ఫ్లాన్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అత్యంత తక్కువ ధరతో ఉండే ఈ ఫ్లాన్లను కొన్ని ఎంపిక చేసిన దేశాలలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. గడిచిన కొద్దికాలంగా సబ్ స్క్రైబర్లు సంఖ్య తగ్గడంతో నెట్‌ ఫ్లిక్స్ సరికొత్తగా ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాంగానే ఈ యాడ్స్ సపోర్టెడ్ ఫ్లాన్స్ ను వినియోగదారుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి నెట్‌ ఫ్లిక్స్ ఈ విషయాన్ని ఈ ఏడాది ప్రారంభంలోనే వెల్లడించింది. ప్రస్తుతం వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. వచ్చే నెల(నవంబర్) 3న ఈ యాడ్ ఆధారిత సేవలను అమెరికాలోప్రవేశ పెట్టబోతున్నది. ఆ తర్వాత 12 దేశాల్లో( ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కొరియా, మెక్సికో, స్పెయిన్, బ్రిటన్‌లో) వినిగదారుల ముందుకు తీసుకురాబోతున్నది.   


బేసిక్ విత్ యాడ్స్ ప్లాన్ధర ఎంతంటే?


నెట్‌ ఫ్లిక్స్ తాజాగా వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్న బేసిక్ విత్ యాడ్స్ ప్లాన్‌ ధరను కంపెనీ ఇప్పటికే ఫిక్స్ చేసింది. అమెరికాలో దీని రేటు నెలకు 6.99 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 576 రూపాయలుగా నిర్ణయించింది. ఇండియాలో ధరలతో పోల్చితే అమెరికాలో నెట్‌ ఫ్లిక్స్ సబ్‌ స్క్రిప్షన్ రేట్లు సుమారు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. భారత్ లో నెట్ ఫ్లిక్స్ ప్రీమియం ప్లాన్ ధర రూ. 649 కగా, అమెరికాలో ఇదే ఫ్లాన్ ధర రూ. 19.99 డాలర్లు అంటే 1, 650 రూపాయలుగా ఉంది. అమెరికాలో బేసిక్ ప్లాన్‌ ధర  9.99 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 825 రూపాయలుగా ఉంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చే  బేసిక్ విత్ యాడ్స్ ప్లాన్‌ ధర అత్యంత తక్కువగా 6.99 డాలర్లకే లభిస్తోంది.


Also Read: ఈ సిరీస్ చూస్తే గజగజ వణకాల్సిందే! ఎక్కువగా ఉలిక్కిపడే సీన్లతో ‘ది మిడ్ నైట్ క్లబ్’ గిన్నిస్ రికార్డు!


యాడ్స్ ఎంతసేపు వస్తాయంటే?


నెట్ ఫ్లిక్స్ తాజాగా తీసుకొస్తున్న బేసిక్ విత్ యాడ్స్ ప్లాన్‌ లో గంటలకు సుమారు 4 నుంచి 5 నిమిషాల పాటు యాడ్స్ వస్తాయి. ఈ విషయాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అఫీషియల్ గా వెల్లడించింది. ఒక్కో యాడ్ డ్యురేషన్ విషయానికి వస్తే 15 నుంచి 30 సెకెన్ల పాటు ఉంటుందని తెలిపింది. తాజాగా తీసుకొచ్చిన బేసిక్ విత్ యాడ్స్ ప్లాన్‌ అమలు పర్చేందుకు గాను నెట్ ఫ్లిక్స్ దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్‌, నీల్సన్‌  సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీల సహకారంతో ఈ నూతన ప్లాన్ ను ఇంఫ్లిమెంట్ చేయబోతున్నది. 


ఎలాంటి ప్రకటనలు నిషేధం అంటే?


నెట్‌ఫ్లిక్స్ రాజకీయ ప్రకటనలను తీసుకోదని వరల్డ్ వైడ్ అడ్వటైజింగ్ ప్రెసిడెంట్ జెరెమీ గోర్మాన్ వెల్లడించారు. ధూమపానం, తుపాకులు, బాణసంచా లాంటి యాడ్స్ ను ప్రదర్శించబోదని తెలిపారు. సెక్స్, నగ్నత్వం, గ్రాఫిక్ హింసతో కూడిన ప్రదర్శనలను నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు.