సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) మరో క్రేజీ మూవీతో  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నీలేష్ కృష్ణ అనే కొత్త దర్శకుడితో తన కెరీర్ లో 75వ చిత్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు పేరు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో టైటిల్, గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు 'అన్నపూరణి-ది గాడెస్ ఆఫ్ టేస్ట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.


చికెన్ కబాబ్ మీద మనసుపడ్డ నయనతార


ఇక తాజాగా విడుదలైన మూవీ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. సంప్రదాయ బ్రాహ్మణ అమ్మాయిగా నయనతార కనిపించింది.  అమ్మ, నాన్న, నాన్నమ్మతో కలిసి ఉంటుంది. పూజా కార్య‌క్ర‌మాల‌తో గ్లింప్స్ మొద‌ల‌వుతుంది. రాత్రి పూజా కార్యక్రమాలతోనే అందరూ నిద్రలోకి జారుకుంటారు. అలాంటి శుద్ధ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన న‌య‌న‌తారకు నాన్ వెజ్ అంటే ఇష్టం కలుగుతుంది. ఇంట్లో వాళ్లు పూజలు, పురస్కారాల్లో బిజీగా ఉంటే, తను మాత్రం పుస్తకాల్లోని నాన్ వెజ్ లెగ్ పీసులను చూసి నోట్లో లాలాజలం ఊరినట్లు చూపిస్తారు.    


లంగావోణీలో అదుర్స్ అనిపిస్తున్న నయన్


ఇక ఈ గ్లింప్స్ లో సినిమా కథ ఏంటి అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. గ్లింప్స్ లో సినిమాటోగ్రఫీ మరో లెవల్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. బ్రాహ్మ‌ణ యువ‌తి పాత్ర‌లో న‌య‌న‌తార చూడ చక్కగా కనిపించింది. ‘అదుర్స్’ సినిమాలో ఇప్పటికే బ్రహ్మణ అమ్మాయిగా కనిపించిన నయనతార మరోసారి అదే పాత్రలో మరింత అందంగా కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె వేసుకున్న లంగావోణీ లుక్స్ కూడా చూడ ముచ్చటగా అనిపించింది. ‘అదుర్స్’ చంద్రకళ మాదిరిగానే ఆకట్టుకుంటోంది. తాజాగా ‘జవాన్’ చిత్రంలో మోడ్రన్ లుక్ లో కనిపించిన ఆమె, ఈ సినిమాలోని సంప్రదాయ లుక్ చూసి అందరూ చూడచక్కగా ఉందంటున్నారు.  






'అన్నపూరణి-ది గాడెస్ ఆఫ్ టేస్ట్’ మూవీలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్,  సురేష్ చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటర్‌గా ప్రవీణ్ ఆంటోని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్ సహకారంతో జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. రీసెంట్ గా నయనతార ‘జవాన్’ మూవీలో కనిపించింది. ఈ సినిమాతో ఆమె బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. హీరో షారుక్‌ ఖాన్‌ తో కలిసి ఆమె ఈ సినిమాలో నటించింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఇటీవల విడుదలైన అద్భుత విజయాన్ని అందుకుంది.  


Read Also: సార్! అది ‘సర్దార్ భగత్ సింగ్’ కాదు, ‘ఉస్తాద్ భగత్ సింగ్’- చేసే సినిమా పేరు మర్చిపోతే ఎలా అండీ!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial