ఆగస్టు 1వ తేదీ నుంచి సినిమా నిర్మాణాలు అన్నీ ఆపాలనే కీలక నిర్ణయం తీసుకుంది ప్రొడ్యూసర్స్ గిల్డ్. అయితే ఈ నిర్ణయాన్ని కొందరు ఆమోదించగా.. మరికొందరు లైట్ తీసుకుంటున్నారు. గిల్డ్ లో యాక్టివ్ మెంబర్ గా ఉన్న దిల్ రాజు తన 'వారసుడు' సినిమా షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై మిగిలిన నిర్మాతలు ఆరా తీయగా.. 'వారసుడు' తెలుగు సినిమా కాదని.. తమిళ సినిమా అని.. తెలుగులో డబ్బింగ్ చేయబోతున్నట్లు చెప్పి షాకిచ్చారు. 


ఈ విషయంపై చాలా మంది నిర్మాతలు ఫైర్ అవుతున్నారు. ఇదే కారణంగా చెప్పి మరికొన్ని బైలింగ్యువల్ సినిమాలు కూడా షూటింగ్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో ఒకట్రెండు రోజులుగా నిర్మాతలంతా కలిసి సమావేశమవుతూ.. నెక్స్ట్ ఏం చేయాలనే విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఈ నిర్ణయాలు ఓ కొలిక్కి రాకముందే యంగ్ హీరో నాని ప్రొడ్యూసర్స్ గిల్డ్ కి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. 


ప్రస్తుతం ఆయన 'దసరా' అనే సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్స్ బంద్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణా కూడా ఆగిపోయింది. అయితే ఇప్పుడు తిరిగి మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి వచ్చే సోమవారం నుంచి షూటింగ్ పునః ప్రారంభించాలనుకుంటున్నారు. ఇదే విషయాన్ని నానికి చెప్పగా.. ఆయన కూడా ఓకే చెప్పారట. నాని కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. 


షూటింగ్ వాయిదా వేస్తూ పోతే.. వడ్డీలు పెరిగిపోతున్నాయి. అందుకే నిర్మాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ అటు సుధాకర్ చెరుకూరి కానీ ఇటు నాని కానీ తగ్గడం లేదట. నాని సినిమా షూటింగ్ మొదలైతే మిగిలిన సినిమాలు కూడా బంద్ విషయాన్ని పక్కన పెట్టి షూటింగ్స్ మొదలుపెట్టేయడం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి!


Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'


Also Read: నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?