నాని(Nani) కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'దసరా'(Dasara). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పోస్టర్స్ ను, పాటను విడుదల చేశారు. వచ్చే ఏడాది 2023, మార్చి 30న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి నేను లోకల్ సినిమాలో నటించారు. దర్శకుడు కొత్త వాడైనా ఈ సినిమాపై నాని ప్రేక్షకులు భారీ అంచలనాలు పెట్టుకున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం బయటకొచ్చింది. అదేంటంటే.. ఇప్పటికే ఈ సినిమాకి రూ.100 కోట్ల బిజినెస్ జరిగిపోయిందట. నాని లాంటి మిడ్ రేంజ్ హీరో నటించిన సినిమా, పైగా కొత్త దర్శకుడు డైరెక్ట్ చేశారు. అలాంటిది ఈ ప్రాజెక్ట్ కి వంద కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగిందంటే విశేషమనే చెప్పాలి. అందుకే ఈ సినిమాపై రూ.50 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన నిర్మాత సుధాకర్ చెరుకూరి.. సినిమా విషయంలో పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. 


ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ 'దసరా' సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం రూ.30 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఇతర భాషలకు చెందిన రైట్స్ కి మరో రూ.10 కోట్లు వచ్చినట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ రూపంలో మరో రూ.20 కోట్లు వచ్చాయట. అంటే కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.60 కోట్లు వచ్చాయి. 


నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాకి రూ.20 కోట్ల రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. 'అంటే సుందరానికి' సినిమాకి రూ.30 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో 'దసరా' సినిమాపై ఎఫెక్ట్ పడుతుందేమోనని అనుకున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. 'దసరా' సినిమాకి రూ.40 కోట్ల రేంజ్ లో థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. అంటే మొత్తం కలుపుకొని రూ.100 కోట్లన్నమాట. నాని కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ అని చెప్పుకోవాలి. మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!


తెలంగాణలోని గోదావ‌రిఖ‌ని సమీపంలో ఉన్న సింగ‌రేణి ప్రాంతానికి చెందిన ఫిక్ష‌న‌ల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ కంప్లీట్ కాగా.. రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలయినట్లు సినిమా యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌, నవీన్ నూలి ఎడిటర్‌.


'దసరా'లో ఇంటెన్స్ లవ్ స్టోరీ:


ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ లవ్ ప్లాట్ ప్లాన్ చేశారు దర్శకుడు. రిచ్ అమ్మాయి.. స్లమ్ లో ఉండే అబ్బాయిని ప్రేమించడం ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల 'దసరా' సినిమాలో కూడా ఇలాంటి ఒక లవ్ స్టోరీని చూపించబోతున్నారు. రాజుగారి కోట లాంటి ఇంట్లో ఉండే హీరోయిన్.. స్లమ్ లో ఉండే హీరోని ప్రేమిస్తుంది. ఈ ఎపిసోడ్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసినట్లు సమాచారం. సినిమాకి ఇదొక ప్లస్ పాయింట్ అవుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.   


Also Read : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?


Also Read : వేలెత్తి చూపిస్తూ, రక్తం అమ్ముకొని బతుకుతున్నానన్నారు - చిరు ఎమోషనల్ కామెంట్స్!