అల్లు అరవింద్ ప్రారంభించిన ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో బాలకృష్ణ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ అధికారికంగా లాంచ్ అయింది. నవంబర్ 4వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ఆహాలో ప్రసారం కానుంది. ఇప్పటివరకు తెలుగులో వేర్వేరు సెలబ్రిటీలు టాక్ షోలు చేశారు. వీటిన్నిటి కంటే భిన్నంగా ఈ టాక్ షో ఉండనుందని తెలుస్తోంది.


ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ ‘నేను ఎన్నో ఏళ్లుగా ఫాంటసీ, పౌరాణికం, జానపదం, కుటుంబ కథా చిత్రాల్లో.. అనేక పాత్రలు పోషించి మీకు వినోదాన్ని అందించాలని ప్రయత్నిస్తున్నాను. ప్రజలు కూడా ఎంతో ప్రేమాభిమానాలతో ప్రతి ప్రయత్నాన్ని విజయవంతం చేస్తూ వచ్చారు. ఇలాంటి ఎన్నో చిత్రాలు మాకు అందించండి అంటూ కొత్త ప్రయత్నాలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు.’ అన్నారు


‘ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం అల్లు అరవింద్ మానసపుత్రిక. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు పోటీగా నిలబడగలం అని తెలుగు వారి సత్తాను ఆయన చాటారు. పొట్టివాళ్లకు పుట్టెడు బుద్ధులు అని అల్లు అరవింద్‌ను చూస్తే అనిపిస్తుంది. అల్లు అరవింద్ గారికి, మా కుటుంబానికి ఎంతో సన్నిహితమైన సంబంధం ఉంది. ఆ చనువుతోనే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను.’ అని తెలిపారు.


ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య గురించి కూడా మాట్లాడారు. ‘ఆయన(అల్లు రామలింగయ్య) ఒక గ్రేట్ లెజెండ్. నేరుగా మా వంటింట్లోకి వచ్చి అమ్మతో టీ పెట్టించుకుని, కబుర్లు చెప్పే చనువున్న వ్యక్తి అల్లు రామలింగయ్య. ఏమమ్మా.. ఏమైనా ఉన్నాయా బండోడికి(పెద్ద ఎన్టీఆర్) అని అడిగేవారు. ఏమైనా ఉంటే చెప్పమ్మా.. నేనెళ్లి ఆయనకు చెప్తాను అని కూడా అనేవారు. ఇండస్ట్రీలో మా కుటుంబంతో అంత చనువున్న ఏకైక వ్యక్తి అల్లు రామలింగయ్య.’ అన్నారు


ఆహా టీం, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి మాట్లాడుతూ ‘ఆహా టీంలో నేను కూడా ఒక సభ్యుడిని అయిపోయాను. ప్రశాంత్ వర్మ ఎంతో అద్భుతంగా నన్ను ప్రెజెంట్ చేశారు. ఈ షో కూడా ఒక మనిషికి సంబంధించిన ప్రెజెంటేషన్’ అన్నారు.


ఆ తర్వాత షో ఎలా ఉండబోతుందనే దానిపై హింట్ కూడా ఇచ్చారు. ‘యాక్టింగ్ అంటే కేవలం నవ్వడమో, కేకలు వేయడమో, నవ్వించడం కాదు. యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి వెళ్లడం. ఆ పాత్ర ఆత్మలోకి ప్రవేశించడం. నేను దీనికి ఒప్పుకోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇప్పుడు నేను పోషించేది యాంకర్ పాత్ర. ఇండస్ట్రీలో రైవల్రీ సహజం. అది సినిమాలు, రాజకీయాల వరకే. కానీ మనం ఆ బావి నుంచి బయటపడితేనే అసలు మనిషి ఆవిష్కృతం అవుతాడు. అలాంటి అసలు మనుషులను బయటకు తీసేదే ఈ అన్‌స్టాపబుల్. అదే నాకు అన్‌స్టాపబుల్‌లో నచ్చింది. అందుకే ఈ కార్యక్రమం ఒప్పుకున్నాను. దీనికి ఎందరో నటీనటులు వస్తారు. వాళ్లతో నేను మాట్లాడతాను. నటీనటులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. తెలివిగా మాట్లాడుతూ వారి లోపలి అంతరంగాన్ని ఆవిష్కరిస్తాం. ’ అని పేర్కొన్నారు.


‘ఈ కార్యక్రమం అల్లు అరవింద్ చేతిలో పడింది కాబట్టి మంచి రూపం తీసుకుంటుందని కరాఖండిగా చెప్పగలను. నా గురించి అందరికీ తెలుసు. నా జీవితం తెరిచిన పుస్తకం. అలాగే ప్రతి ఒక్కరి జీవిత పుస్తకాన్ని ఆవిష్కరించాలి. అన్‌స్టాపబుల్ అనేది కూడా ప్రజాసేవే. ప్రజలకు వినోదాన్ని అందించడం కూడా ప్రజాసేవే కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు. నవంబర్ 4వ తేదీన అన్‌స్టాపబుల్ ప్రారంభం కానుంది. ఆహాలో కలుద్దాం’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.


Also Read:  'అంత ఇష్టం ఏందయ్యా' పవన్ ని ఓరగా చూస్తోన్న నిత్యామీనన్


Also Read: పవర్‌ ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా డార్లింగ్ …ఖాకీ డ్రెస్ లో ప్రభాస్ కటౌట్ చూస్తే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి