నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy). కర్నూలులోని కొండా రెడ్డి బురుజు దగ్గర టైటిల్ అనౌన్స్ చేశారు. ఆ టైటిల్ మోషన్ పోస్టర్, బాలకృష్ణ లుక్ అటు నందమూరి అభిమానులను, ఇటు సగటు తెలుగు సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 


బాలకృష్ణకు దర్శకుడు గోపీచంద్ మలినేని వీరాభిమాని. అభిమానులు కోరుకునే విధంగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ తీస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 
వెంకట్ మాస్టర్ నేతృత్వంలో ఫైట్!
'వీర సింహా రెడ్డి' కోసం బాలకృష్ణ, విలన్స్ బ్యాచ్ మీద హైదరాబాద్‌లో భారీ ఫైట్ ఒకటి తెరకెక్కిస్తున్నారు. సినిమాలో కీలక సందర్భంలో ఈ ఫైట్ వస్తుందని, గూస్ బంప్స్ ఇచ్చేలా, హీరోయిజం ఎలివేట్ అయ్యేలా ఉంటుందని తెలిసింది. చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ ఫైట్ స్పెషల్‌గా ఉండేలా డిజైన్ చేశారట.
    
బాలయ్య బాబును దర్శకత్వం వహించే అవకాశం రావడం తన అదృష్టమని, ఓ  అభిమానిగా 'వీర సింహా రెడ్డి' చిత్రాన్ని తెరకెక్కించానని టైటిల్ విడుదల కార్యక్రమంలో గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తెలిపారు. 


వాస్తవ ఘటనల ఆధారంగా 'వీర సింహా రెడ్డి'
ఫ్యాక్షన్ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది బాలకృష్ణ. 'సమర సింహా రెడ్డి', 'నరసింహ నాయుడు' ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. అలాగే, 'సింహా' టైటిల్‌తో వచ్చిన బాలకృష్ణ సినిమాలు అన్నీ భారీ విజయాలు సాధించాయి. 'వీర సింహా రెడ్డి'లో కూడా సింహా ఉంది. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. టైటిల్ సెంటిమెంట్ మాత్రమే కాదు... సినిమాలో అద్భుతమైన కంటెంట్ కూడా ఉందని తెలుస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది.  


Also Read : 'ఝాన్సీ' వెబ్ సిరీస్ రివ్యూ : లేడీ గజినీలా మారిన అంజలి - సిరీస్ ఎలా ఉందంటే?


Balakrishna's Veera Simha Reddy Dialogues : బాలకృష్ణ అంటే పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండాలి. అందులోనూ సీమ నేపథ్యంలో సినిమా అంటే అభిమానులు చాలా ఊహిస్తారు. అందుకు తగ్గట్టుగా రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారని గోపీచంద్ మలినేని తెలిపారు. 'వీర సింహా రెడ్డి' పుట్టింది పులిచర్ల ... చదివింది అనంతపురం... రూలింగ్ కర్నూల్' లాంటి డైలాగులు సినిమాలో ఉన్నాయన్నారు.


శ్రుతీ హాసన్ కథానాయికగా... ఇతర పాత్రల్లో హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్ మలినేని సినిమాలకు తమన్ సూపర్ మ్యూజిక్ అందిస్తారు. బాలకృష్ణకు 'అఖండ'కు ఆయన ఎలాంటి సంగీతం ఇచ్చారో చూశారు. అందుకని, ఈ సినిమా మ్యూజిక్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.