బాయ్‌కాట్‌... బాయ్‌కాట్‌... బాయ్‌కాట్‌... తమకు నచ్చని హీరో హీరోయిన్లు లేదంటే దర్శక - నిర్మాతలు తీసిన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంటే, కొంత మంది సోషల్ మీడియాలో బాయ్‌కాట్‌ పిలుపు ఇస్తున్నారు. ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' తదితర హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో బాయ్‌కాట్‌ ప్రభావం అని కొందరు అనుకున్నారు. 
'భూల్ భులయ్యా 2', 'బ్రహ్మాస్త్ర' సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. బాయ్‌కాట్‌ ట్రెండ్ ఈ సినిమాలపై ప్రభావం చూపించలేకపోయింది. ఈ నేపథ్యంలో కంటెంట్ ఉన్న సినిమాలు విజయాలు సాధిస్తాయనే నమ్మకం పెరిగింది. కింగ్ అక్కినేని నాగార్జున కూడా అదే మాట అంటున్నారు.


Akkineni Nagarjuna On Brahmastra Success : ''బాయ్‌కాట్‌ ట్రెండ్ సినిమా ఇండస్ట్రీపై అంతగా ప్రభావం చూపిస్తుందని నేను అనుకోవడం లేదు. 'లాల్ సింగ్ చడ్డా' ఆడలేదు. కానీ, 'బ్రహ్మాస్త్ర' ఆడింది కదా! అంతకు ముందు ఆలియా భట్ నటించిన 'గంగూబాయి కతియావాడి', 'భూల్ భులయ్యా 2', 'జగ్ జగ్ జుయో' సినిమాలు ఆడాయి కదా!'' అని నాగార్జున పేర్కొన్నారు. 'బ్రహ్మాస్త్ర' మంచి విజయం సాధించడంతో పాటు తన పాత్రకు పేరు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చాలా సింపుల్‌గా ఆయన బాయ్‌కాట్‌ ట్రెండ్‌ను తీసి పారేశారు.


'బ్రహ్మాస్త్ర 2'లో నాగార్జున ఉంటారా?
'బ్రహ్మాస్త్ర'కు భారీ వసూళ్లు వస్తున్న నేపథ్యంలో ' బ్రహ్మాస్త్ర 2 : దేవ్' (Brahmastra Part 2 Dev) సినిమాపై ఆసక్తి పెరిగింది. మొదటి భాగంలో నంది అస్త్రంగా నాగార్జున కనిపించారు. ఆయన పాత్రకు ముగింపు కూడా ఇచ్చారు. మరణించినట్లు చూపించారు. మరి, రెండో భాగంలో ఆయన ఉంటారా? లేదా? దీనిపై నాగార్జున స్పందిస్తూ... ''బ్రహ్మాస్త్ర రెండు, మూడు భాగాలలో నా పాత్ర ఉంటుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేను'' అని అన్నారు. అయితే... మంచి పాత్రలు కంటిన్యూ అవుతాయని అనుకుంటున్నానని మరో మాట చెప్పారు. దాంతో 'బ్రహ్మాస్త్ర 2'లో నాగార్జున ఉంటారని ఆశించవచ్చు.


Also Read : రియలిజం ఫాంటసీ స్టోరీ - 'ఒకే ఒక జీవితం' డైరెక్టర్‌కి బన్నీ ఛాన్స్ ఇస్తారా?


దర్శకుడు అయాన్ ముఖర్జీ తనకు ఏం చెప్పాడో... అదే తీశాడని నాగార్జున తెలిపారు. తన పాత్ర తెరపై కనిపించినంత సేపూ హ్యాపీగా అనిపించిందని అయాన్ తనతో చెప్పాడని ఆయన తెలిపారు.     


వందో సినిమాకు కథ కావలెను!
అక్టోబర్ 5న 'ది ఘోస్ట్' (The Ghost Movie)తో నాగార్జున ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా రూపొందింది. 'గరుడవేగ' సినిమా చూసి ప్రవీణ్ సత్తారును పిలిచానని, ఇన్నాళ్ళు తనతో ఎందుకు సినిమా చేయలేదని బాధపడ్డానని నాగార్జున తెలిపారు. ప్రస్తుతం తన వందో సినిమా (Nagarjuna 100th Movie) కోసం కథలు వింటున్నానని ఆయన పేర్కొన్నారు. ఆ సినిమా గొప్పగా ఉండాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.


Also Read : రెండు రోజులు షూటింగ్ చేసిన తర్వాత హీరోయిన్‌గా నన్ను తీసేశారనుకున్నా - సిద్ధీ ఇద్నాని ఇంటర్వ్యూ