యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది. చైతన్యకు తొలి స్ట్రయిట్ తమిళ చిత్రమిది. ఈ రోజు ఆయన బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సినిమాకు 'కస్టడీ' (Custody Movie) టైటిల్ ఖరారు చేసినట్టు తెలిపారు.
నాగ చైతన్య, వెంకట్ ప్రభు కలయికలో సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో నిర్మించిన 'ది వారియర్' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. నాగ చైతన్యకు ఇది 22వ చిత్రమిది. అందుకని, NC 22 వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు.
పోలీస్ రోల్‌లో చైతన్య!
'కస్టడీ' సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఒక్క రోజు ముందు విడుదల చేసిన ప్రీ లుక్ చూస్తే అర్థం అయిపోతుంది. అయితే... తోటి అధికారులు ఆయన్ను కదలకుండా తమ చేతుల్లో ఎందుకు బంధించారనేది సస్పెన్స్. ఈ సినిమాలో హీరో పేరు 'ఏ చైతన్య'. ఏ అంటే అక్కినేని అయ్యి ఉంటుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లా ఉంది. చైతూ లుక్‌లో ఇంటెన్సిటీ కనిపిస్తోంది. 'ప్రపంచంలో మార్పు రావాలంటే... అది ముందుగా నీలో రావాలి' అని అర్థం వచ్చేలా ఓ కొటేషన్ కూడా చూపించారు.
కృతి శెట్టితో మరోసారి!
నాగ చైతన్యకు జోడీగా ఈ సినిమాలో కృతి శెట్టి (Krithi Shetty) నటిస్తున్నారు. ఈ ఇద్దరిదీ సూపర్ హిట్ జోడీ. వీళ్ళిద్దరూ సూపర్ హిట్ సినిమా 'బంగార్రాజు'లో సందడి చేశారు. అందులో 'బంగార... బంగార...' సాంగ్ కూడా సూపర్ హిట్. మరో సారి ఈ సినిమాలో ఈ జంట సందడి చేయనుంది.
అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, 'వెన్నెల' కిశోర్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి తండ్రీ కుమారులు, సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పించనున్నారు. అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి కూర్పు : వెంకట్ రాజన్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్, యాక్షన్ : మహేష్ మాథ్యూ, కళా దర్శకత్వం : డివై సత్యనారాయణ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వెంకట్ ప్రభు
Also Read : హ్యాపీ బర్త్ డే విష్ణు మంచు - ప్రేమించినా సరే, ద్వేషించినా సరే ఆయన్ను మాత్రం వదల్లేరు!
తమిళంలో శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన 'మానాడు' భారీ విజయం సాధించింది. తెలుగులో నాగ చైతన్య హీరోగా ఆ సినిమాను రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే... ఈ సినిమా తెలుగు, తమిళ్ బైలింగ్వల్ కావడంతో అని ప్రకటించడంలో నాగ చైతన్యతో వెంకట్ ప్రభు చేయబోయేది రీమేక్ కాదని స్పష్టం అయ్యింది. 'మానాడు'ను రానా దగ్గుబాటి రీమేక్ చేయనున్నారు.