'ప్రేమించండి లేదా ద్వేషించండి. కానీ, అతడిని మాత్రం విస్మరించలేరు' (Love Or Hate Him, But Can't Ignore Him) - అని కొందరు గురించి చెబుతుంటారు. ఆ కొందరిలో విష్ణు మంచు (Vishnu Manchu) కూడా ఒకరని చెప్పవచ్చు ఏమో!?


విష్ణు మంచును ప్రేమించే ప్రేక్షకులు, అభిమానులు ఉన్నారు. అదే సమయంలో ఆయన్ను ద్వేషించే ప్రజలూ ఉన్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆ విషయం ఈజీగా అర్థం అవుతుంది. ఒక్కటి మాత్రం నిజం, ప్రేమించినా సరే... ద్వేషించినా సరే... విష్ణు మంచును మాత్రం వదల్లేరు. సెలబ్రిటీలపై ప్రేక్షకులు అభిమానం చూపించడం, విమర్శలు చేయడం సహజమే. అయితే, విష్ణు విషయానికి వస్తే... కొన్ని సందర్భాల్లో విమర్శలు ఎక్కువ వచ్చాయి. తనపై వస్తున్న ట్రోలింగ్, మీమ్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడిన కథానాయకుడు విష్ణు మంచు.


విష్ణు మంచు కథానాయకుడు, నిర్మాత. తండ్రి కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు కథానాయకుడిగా నటించిన 'రగిలే గుండెల్లో' చిత్రంతో బాల నటుడిగా చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'విష్ణు' సినిమాతో హీరోగా వెండితెరపైకి వచ్చారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ... తర్వాత నిర్మాత అయ్యారు. ఆయనలో రచయిత కూడా ఉన్నారు. తాను హీరోగా నటించి, నిర్మించిన 'మోసగాళ్లు', సంపూర్ణేష్ బాబు హీరోగా నిర్మించిన 'సింగం 123' చిత్రాలకు కథలు అందించారు.


మోహన్ బాబు వారసుడిగా వెండితెరపైకి వచ్చినప్పటికీ... విష్ణు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. డైలాగులు చెప్పడంలో మోహన్ బాబుది ప్రత్యేక శైలి. ఆ విషయంలో తండ్రిని అనుకరించకుండా... తనకంటూ సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. విష్ణు నటించిన సినిమాల్లో హిట్లు ఉన్నాయి. సరిగా ఆడని సినిమాలు ఉన్నాయి. అయితే... సాలిడ్ హిట్ పడలేదనే ఫీలింగ్ ఆయన ఫ్యాన్స్ అండ్ పబ్లిక్‌లో ఉంది.


Also Read : హ్యాపీ బర్త్ డే నాగ చైతన్య - ఆయన్నుంచి ఆ ఒక్కటీ నేర్చుకోవాలి బాస్!


సినిమాలు కంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు విష్ణును ఆ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలిపాయి. అప్పటి వరకు ఆయనపై కొన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. మా ఎన్నికల తర్వాత అవి పెరిగాయని చెప్పాలి. తనతో పాటు కుటుంబంపై వస్తున్న మీమ్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణు... వాటి వెనుక ఓ ప్రముఖ నటుడు ఉన్నాడని చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం అయ్యాయి.  విష్ణు సినిమా వస్తుందటే... ఫ్యాన్స్ మాత్రమే కాదు, అందరూ ఎదురు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.  


విష్ణు మంచు కెరీర్‌లో 'ఢీ' వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. కమర్షియల్ పరంగా ఆ సినిమా భారీ విజయం సాధించింది. అంతే కాదు... విష్ణులో కామెడీ టైమింగ్ పూర్తిస్థాయిలో బయటకు వచ్చింది ఆ సినిమాతోనే! 'దేనికైనా రెడీ', 'దూసుకెళ్తా', 'పాండవులు పాండవులు తుమ్మెద', 'రౌడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. త్వరలో 'ఢీ'కి సీక్వెల్ 'ఢీ అండ్ ఢీ' చేయడానికి విష్ణు మంచు రెడీ అవుతున్నారు. 'ఢీ' కంటే డబుల్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ విష్ణు మంచుకు ఆల్ ది బెస్ట్.


Also Read : హ్యాపీ బర్త్ డే త్రివిక్రమ్ - ఆయన్ను ఎందుకు 'గురూజీ' అంటున్నారు?