Pankaj Udhas Death : ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్యాంసుడు పంకజ్ ఉదాస్ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాసను విడిచారు. ఈ వార్తను పంకజ్ కుమార్తె నయాబ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ వార్తతో బాలీవుడ్ సెలబ్రెటీలు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషలో మీడియాలో పోస్ట్​లు, స్టోరీలు పెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పంకజ్​కు నివాళి తెలిపారు. 


గుజరాత్​లోని జెటూర్​లో 1951లో పంకజ్ జన్నించారు. చదువుకునే సమయంలో ఆయన కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయింది. ముగ్గురు సోదరులలో పంకజ్ చిన్నవారు. ఇతని పెద్ద అన్న మన్హర్ ఉదాస్ బాలీవుడ్​లో ప్లేబ్యాక్ సింగర్​గా మంచిపేరు తెచ్చుకున్నారు. రెండో అన్న నిర్మల్ ఉదాస్ కూడా గజల్ సింగర్​గా మంచిపేరు తెచ్చుకున్నారు. పంకజ్ ఉదాస్ కూడా వారి అన్నల మార్గంలోనే వెళ్లారు. ఆయన తండ్రి కూడా వాయిద్యాలు ప్లే చేస్తూ ఉండేవారు. తండ్రి, అన్నలను చూసిన పంకజ్​కు కూడా మ్యూజిక్​పై ఆసక్తి కలిగి.. అటువైపే తన కెరీర్​ను మొదలుపెట్టారు. 


తుమ్ హసీన్ మే జవాన్ సినిమాలో చాందీ జైసా రంగ్ అనే పాటతో పంకజ్ తన కెరీర్​ను ప్రారంభించారు. 1970లో తొలిసారి దీనిని పాడి కెరీర్​ను మొదలు పెట్టారు. మన్హర్ ఉదాస్​తో కలిసి తన మొదటి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఎన్నో సినిమాలు, స్టేజ్ పర్ఫార్మెన్స్​లు చేశారు. 1980లో ఆహత్ అనే గజల్ ఆల్బమ్ మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ముకరర్, తర్రన్నమ్, మెహ్​ఫిల్, నయాబ్ వంటి అనేక హిట్​లను అందించారు. 1986లో నామ్​ అనే సినిమాలో చిట్టి ఆయా హై పాటతో ఆయనకు గుర్తింపు వచ్చింది. దాదాపు 16 సంవత్సరాల సినీ కెరీర్​లో ఆయనకు ఈ పాటతో మంచి బ్రేక్ దొరికింది. 


చిట్టి ఆయా హై పాట తర్వాత మూడు దశాబ్ధాల పాటు.. పంకజ్ తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చాంది జైసా రాంగ్ హై తేరా.. ఔర్ ఆహిస్తా కిజియే బాతే, తోడి తోడి పియా కరో వంటి ఎన్నో అద్భుతమైన బాలీవుడ్ సాంగ్స్​ను ఆలపించారు. సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్స్​ను కూడా ఆయన రిలీజ్ చేశారు. సింగర్​గా కంటే గజల్ సింగర్​గా ఎక్కువ పేరును సంపాదించుకున్నారు. సింగర్​గా ఎన్నో అవార్డులు అందుకున్నారు. గజల్స్​లో ఆయన చేసిన సేవలు గుర్తించిన కేంద్రం 2006లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 


భారతీయ సంగీత ప్రపంచంలో గజల్, నేపథ్య గాయకుడిగా పంకజ్ ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు. ముఖ్యంగా హిందీలో ఆయన పాడిన పాటలు ఎందరినో ఆకట్టుకున్నాయి. లత మంగేష్కర్​తో కలిసి ఆయన పాడిన ప్రతి ఆల్బమ్ సూపర్ హిట్ అయినట్లు చెప్తారు. ఘాయల్ సినిమా​లో మహియా తేరా కసమ్ అనే డ్యూయెట్ బాగా హిట్​ అయింది. 1970 నుంచి 2016 వరకు ఆయన సంగీత ప్రపంచలో తన కాంట్రిబ్యూషన్ అందించారు. వయసు రీత్యా దీనికి బ్రేక్​ తీసుకున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ నిన్న (ఫిబ్రవరి 26) ముంబైలో కన్నుమూశారు. 


Also Read :  ఓటీటీలోకి ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?