Mani Sharma Mother Passed away: ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు(Krishnam Raju) మరణవార్త విన్న కాసేపటికే.. మరొక చేదు వార్త అందరినీ కలచివేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ(Manisharma) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సరస్వతి(88) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న సరస్వతి ఆదివారం సాయంత్రం చెన్నైలో మరణించారు. 


వెంటనే మణిశర్మ చెన్నైకి బయలుదేరినట్లు తెలుస్తోంది. అక్కడే అంత్యక్రియలు చేయనున్నారు. మణిశర్మ సోదరుడు రామకృష్ణ నివాసంలో ఆమె కన్ను మూసినట్లు సమాచారం. సోమవారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. 


మరోపక్క కృష్ణంరాజు మరణంతో సినీ ప్రముఖులంతా ప్రభాస్ ఇంటికి వెళ్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, గోపీచంద్, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ ఇలా చాలా మంది కృష్ణంరాజు ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. 


వయోభారంతో కృష్ణం రాజుకు ఆరోగ్య సమస్యలు: 


కృష్ణం రాజు వయసు 83 ఏళ్ళు. వయోభారం వల్ల వచ్చిన అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల నుంచి ఆయనకు సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా సమయంలో కూడా రెండు సార్లు ఆస్పత్రికి వెళ్లి వచ్చారు. అప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు కూడా వచ్చాయి. 


విజయనగర సామ్రాజ్య రాజవంశస్తులు:


పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు 1940 జనవరి 20న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. వీరు విజయనగర సామ్రాజ్య రాజకుటుంబానికి చెందిన వంశస్తులు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి. 1996లో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. ఆయనకు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా పని చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1970, 1980లలో దాదాపు 183 కు పైగా సినిమాలలో నటించారు. 1977, 1984 సంవత్సరాల్లో నంది అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. 1986 లో తాండ్ర పాపారాయుడు అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. 2006లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవన సాఫల్య పురస్కారం అందింది. బొబ్బిలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, సినిమాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి.


రాధే శ్యామ్ చివరి సినిమా:


'రాధే శ్యామ్'లో తన తమ్ముడు సూర్యనారాయణ రాజు కుమారుడు ప్రభాస్‌తో కలిసి కృష్ణం రాజు నటించారు. ఆ సినిమాలో కూడా కేవలం ప్రభాస్ కోసమే నటించారు. నటుడిగా ఆయన చివరి సినిమా 'రాధే శ్యామ్'.


Also Read: వాసన చూసి రుచి చెప్పేయొచ్చు, కృష్ణం రాజు చేపల పులుసు తయారీ వీడియో వైరల్!


Also Read : కృష్ణం రాజు ఫంక్షన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన సీనియర్ ఎన్టీఆర్