సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన 'సర్కారు వారి పాట' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. టాక్ సంగతి పక్కన పెడితే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా కొన్ని థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
కలెక్షన్స్ తగ్గుతున్న సమయంలో ఇప్పుడు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయడానికి ఈ సినిమాలో మరో పాటను యాడ్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి 'మ మ మహేశా...' సాంగ్ ప్లేస్‌లో ముందు మరో పాట అనుకున్నారు. అదే 'మురారి బావ' సాంగ్. మహేష్ కెరీర్‌లో మురారి సినిమా చాలా స్పెషల్. అందుకే.. 'మురారి' అంటూ ఓ పాట రాయించారు. అయితే.. సినిమా అంతా చూసిన తర్వాత అక్కడ ఒక మాస్ సాంగ్ ఉంటే బావుంటుందని దర్శకుడు పరశురామ్ భావించారు.
మహేష్ బాబు, సంగీత దర్శకుడు తమన్‌కు ఆ విషయం ఆయన చెప్పడం.. వెంటనే 'మురారి' బదులు 'మ మ మహేశా..' అంటూ మాస్ పాట కంపోజ్ చేసి తమన్ తీసుకు రావడం జరిగాయి. మహేష్ కూడా ఓకే చేశారు. అలా, 'మురారి' ప్లేస్‌లో 'మ మ మహేశా' వచ్చింది. అభిమానుల కోసం 'మురారి' పాటను యూట్యూబ్‌లో విడుదల చేస్తామని మహేష్ బాబు చెప్పారు. కానీ ఇప్పుడు ఏకంగా సినిమాలో యాడ్ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.
మరిన్ని కలెక్షన్స్ రాబట్టుకోవడానికి చేసిన ప్లాన్ ఇది. మరి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఈ వారం 'మేజర్', 'విక్రమ్' లాంటి క్రేజీ బజ్ ఉన్న సినిమాలు విడుదలవుతున్నాయి. వీటి మధ్యలో 'సర్కారు వారి పాట' నిలబడం కష్టమే. మరేం జరుగుతుందో!