'ఇండియన్ 2' సినిమాకొచ్చినన్ని కష్టాలు ఏ సినిమాకి రాలేదనే చెప్పాలి. దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టారో అప్పటినుంచి ఏదోక అడ్డంకి వస్తూనే ఉంది. సినిమాను పూర్తి చేయాలని ఎంతగా అనుకున్నా.. ఓ పట్టాన తెమలడం లేదు. ముందుగా సినిమా షూటింగ్ సమయంలో క్రేన్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో షూటింగ్ ను చాన్నాళ్లపాటు వాయిదా వేయాల్సి వచ్చింది. కోర్టు విచారణ, కేసులంటూ నిర్మాతలు తిరగడంతోనే సమయమంతా అయిపోయింది. 

 

ఆ గ్యాప్ శంకర్ వేరే సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ విషయం నిర్మాతలకు మరింత కోపం తెప్పించింది. దీంతో శంకర్ పై కేసు పెడుతూ కోర్టుకెళ్లారు. తమ సినిమా పూర్తయిన తరువాత శంకర్ వేరే సినిమాలను పూర్తి చేయాలంటూ కోర్టుకి వినతిపత్రం అందించారు. ఫైనల్ గా ఈ కేసులు ఇరు వర్గాలు రాజీ పడి.. ఓ అగ్రిమెంట్ కి వచ్చారు. ఈ ప్రాసెస్ లో కమల్ హాసన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని వార్తలొచ్చాయి. 

 

తాజాగా ఈ వార్తలపై కమల్ హాసన్ స్పందించారు. ఆయన నటించిన 'విక్రమ్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు కమల్ హాసన్. ఈ క్రమంలో 'ఇండియన్2' సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాకి తను దర్శకత్వం వహించడం లేదని చెప్పారు. దర్శకుడు శంకరే ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తారని.. అన్నారు. ప్రస్తుతం ఆయన వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారని.. అది అవ్వగానే 'ఇండియన్2' సినిమా మొదలవుతుందని చెప్పారు. 

 

తన నుంచి ఎక్కువ సినిమాలు రావాలని అభిమానులు ఆశిస్తున్నారని.. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేయాలని ఉందని అన్నారు. అందుకే దర్శకత్వ బాధ్యతను నెత్తిమీద పెట్టుకోవాలనుకోవడం లేదని చెప్పారు. సో.. 'ఇండియన్2' సినిమా శంకరే డైరెక్ట్ చేస్తారన్నమాట. ఈ సినిమాలో రకుల్ ఒక హీరోయిన్ గా కనిపించనుంది.