ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా వేర్వేరు కాక ముందు ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సినిమా కళాకారులకు నంది అవార్డులు ఇచ్చేది. రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం ఆ నందుల్ని పక్కన పెట్టేశాయి. గతంలో కొందరు కళాకారులు ఆ అవార్డుల మీద తమ గళం వినిపించారు. నంది అవార్డులను మళ్ళీ ఇచ్చేలా చూడాలని తాజాగా మురళీ మోహన్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు.
''స్వర్గీయ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నంది పురస్కారాలకు ఉన్న విశిష్టత మనకు తెలుసు. కానీ, తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత అవార్డుల గురించి పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో మళ్ళీ అవార్డులు మొదలు పెట్టాలని... ఇన్నేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న అవార్డులను ఇవ్వాలని... ప్రతి ఏడాది పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను'' అని మురళీ మోహన్ అన్నారు.
మురళీ మోహన్ చేసిన విజ్ఞప్తి పట్ల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ... ''ఈ అంశాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకు వెళతా. ఆయనతో తప్పకుండా మాట్లాడతా. రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే. కొన్నేళ్ళుగా ఇవ్వాల్సిన అవార్డులు అన్నిటినీ మా ప్రభుత్వం కచ్చితంగా ఇచ్చే విధంగా చూస్తా'' అని చెప్పారు.
'నటసింహ చక్రవర్తి' మురళీ మోహన్
VB Entertainments Silver Screen Awards 2023 - Tribute to Dr. Murali Mohan: వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పదో వార్షికోత్సవ అవార్డుల వేడుకలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మురళీ మోహన్ మధ్య ఈ సంభాషణ జరిగింది. చిత్రసీమలో మురళీ మోహన్ ప్రవేశించి 50 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఆయనకు 'నట సింహ చక్రవర్తి' బిరుదు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ''మురళీ మోహన్ గారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో నిర్బవహించిన ఈ వేడుకకు విష్ణు బొప్పన్న నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉంది. మంచి వ్యక్తిత్వం కలిగిన ఆయనను సన్మానించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, మంచి వ్యక్తిగా ఆయనను చూశా. అలాంటి వ్యక్తికి సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ స్థాపించిన విష్ణు బొప్పన్న పదేళ్ళుగా అవార్డులు ఇస్తున్నారు. ఆయనకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది'' అని చెప్పారు.
Also Read: బబుల్‌గమ్ రివ్యూ: రాజీవ్, సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా... బావుందా? సాగిందా?
మురళీ మోహన్ మాట్లాడుతూ... ''విష్ణు బొప్పన గారు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు సంతోషంగా ఉంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సన్మానం జరగడం ఆనందాన్ని కలిగిస్తోంది. విష్ణు బొప్పన అవార్డ్స్ ఫంక్షన్ కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'' అని చెప్పారు.
వికలాంగులకు చెక్కులు అందజేశా!
వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత విష్ణు బొప్పన మాట్లాడుతూ... ''ప్రతి ఏడాది పేద కళాకారులకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం లేదంటే వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం చేసేవాడిని. ఈసారి వికలాంగులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతులు మీదుగా చెక్కుల అందజేశాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసే శక్తి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ ఫంక్షన్ ఇంత ఘనంగా జరగడానికి కారణం మా స్పాన్సర్ విజన్ వీవీఈ హౌసింగ్ ఇండియా, ఎస్ఎస్ఎల్ గ్రూప్, ఆదూరి గ్రూప్, డిఎస్ఆర్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా, ఆరాధ్య గ్రూప్, కేశినేని డెవలపర్స్, హోజాయ్ కంఫర్ట్ మద్దతు'' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో 'సీతా రామం' దర్శకుడు హను రాఘవపూడి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, 'బింబిసార' దర్శకుడు వశిష్ట, కమెడియన్ శ్రీనివాస రెడ్డి, నటి ఎస్తేర్, గాయని హారిక నారాయణ, గాయకుడు కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.
Also Read: డెవిల్ రివ్యూ: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా హిట్టా? ఫట్టా?