థియేటర్ల దగ్గర ఈ శుక్రవారం చిన్న సినిమాల జాతరే. ఒకటి రెండు కాదు... ఏకంగా ఏడెనిమిది సినిమాల వరకూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి. ఎన్ని విజయాలు సాధిస్తాయి? ఎంత మంది హీరో హీరోయిన్లు తమ నటనతో పేరు తెచ్చుకుంటారు? అనేది పక్కన పెడితే... ఆయా సినిమాల్లో నటించిన ఐదుగురు హీరోయిన్లకు మాత్రం కచ్చితంగా విజయం అందుకోవాల్సిన పరిస్థితి. ఇండస్ట్రీలో మరో సూపర్ స్టెప్ వేయాలంటే తప్పకుండా హిట్ కొట్టి తీరాలి. ఆ హీరోయిన్లు ఎవరో ఓ లుక్ వేయండి.  


అనూ ఇమ్మాన్యుయేల్...
మళ్ళీ స్టార్స్‌తో చేయాలోయ్!
తెలుగులో అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) కెరీర్ చిన్న సినిమాలతో స్టార్ట్ అయినప్పటికీ... తక్కువ కాలంలో పవన్ కళ్యాణ్ (అజ్ఞాతవాసి), అల్లు అర్జున్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా), అక్కినేని నాగ చైతన్య (శైలజా రెడ్డి అల్లుడు) వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు అందుకున్నారు. స్టార్స్‌తో ఆవిడ చేసిన సినిమాలు ఏవీ హిట్ కాలేదు. దాంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. ఈ సమయంలో అల్లు శిరీష్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన 'ఊర్వశివో రాక్షసివో' (Urvasivo Rakshasivo Movie) విడుదల అవుతోంది. ట్రైలర్స్ చూస్తే అనూ ఇమ్మాన్యుయేల్ గ్లామర్ షో చేసినట్టు అర్థం అవుతోంది. ఈ సినిమా హిట్ అయితే ఆమెకు మరో రెండు మూడు అవకాశాలు వస్తాయి. అందుకని, ఈ సినిమాపై ఆవిడ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే... దీని తర్వాత ఆవిడ చేతిలో రవితేజ 'రావణాసుర' సినిమా ఒక్కటే ఉంది. పైగా, అందులో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. ఆ సినిమా విజయం కంటే సోలో హీరోయిన్‌గా విజయం అనూకు చాలా అవసరం.
 
రష్మీ గౌతమ్...
సిల్వర్ స్క్రీన్ సక్సెస్ కోసం!
బుల్లితెరపై రష్మీ గౌతమ్ (Rashmi Gautam) కు తిరిగి లేదు. వారానికి మూడు రోజులు మూడు షోలతో టీవీలో కనిపిస్తున్నారు. వెండితెరపై 'గుంటూరు టాకీస్' వంటి విజయాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అయితే... సినిమా ఛాన్సులు ఎక్కువ రావడం లేదు. మరిన్ని అవకాశాలు రావాలంటే నందుకు జోడీగా రష్మీ గౌతమ్ నటించిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' (Bomma Blockbuster Movie) సక్సెస్ సాధించడం ఎంతైనా అవసరం! ఆమె కూడా ఈ సినిమా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. సక్సెస్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు.


'జాతి రత్నాలు'...
అదొక్కటీ సరిపోదుగా!
తొలి సినిమా 'జాతి రత్నాలు'తో ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) సూపర్ సక్సెస్ అందుకున్నారు. తన నటనతో ప్రేక్షకుల్ని నవ్వించారు. ఆ సినిమా తర్వాత ఆమె హీరోయిన్‌గా నటించిన మరో సినిమా 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్' (Like Share Subscribe Movie). ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. ఇది హిట్టయితేనే ఫరియాకు మళ్ళీ ఛాన్సులు వస్తాయి. ఎందుకంటే... 'జాతి రత్నాలు', 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్' మధ్య ఆవిడ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో అతిథి పాత్ర చేశారు. 'బంగార్రాజు'లో ప్రత్యేక గీతంలో కనిపించారు. 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్' ఫ్లాప్ అయితే అటువంటి అతిథి పాత్రలు, ప్రత్యేక గీతాలు చేయమని ఆమెను అడిగే ప్రమాదం ఉంది. హైట్ కూడా మరీ ఎక్కువ కావడం వల్ల... దాన్ని పక్కన పెట్టి ఛాన్సులు ఇవ్వాలంటే ఫరియా సినిమా చేస్తే హిట్ అనే సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వాలి.


'దొరసాని'...
'ఆకాశం' అంటూ!
'దొరసాని' బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ... పాటలు హిట్టు. చాలా మంది ప్రశంసలు అందుకుంది. రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక (Shivatmika Rajasekhar) నటనకు కూడా పేరొచ్చింది. అయితే... ఆ సినిమా విడుదలై మూడేళ్లు దాటింది. ఇప్పుడు 'ఆకాశం' అంటూ దొరసాని తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో అశోక్ సెల్వన్, రీతూ వర్మ, కల్యాణీ ప్రియదర్శన్, అపర్ణా బాలమురళి తదితరులు నటించారు. రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ కంటెంట్‌తో రూపొందించినట్టు తెలుస్తోంది. దీని తర్వాత శివాత్మిక నటించిన 'పంచతంత్రం' కూడా డిఫరెంట్ సినిమా. అదొక యాంథాలజీ. అందులో కూడా చాలా మంది తారలు ఉన్నారు. అందువల్ల, కమర్షియల్ కథానాయికగా అవకాశాలు అందుకోవడానికి, ఇంకో సినిమా చేతిలో పడటానికి 'ఆకాశం' (Aakasham Movie) సక్సెస్ శివాత్మికకు చాలా ఇంపార్టెంట్. 


నందితకు
విజయం దక్కేనా?
హిట్ సినిమా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో నందితా శ్వేత (Nandita Swetha) తెలుగులో కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి కానీ... విజయాలు దక్కడం లేదు. ఈ తరుణంలో నందితా శ్వేత నటించిన 'జెట్టి' (Jetty Movie) ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీని కంటే ముందు కొన్ని రోజులు 'ఢీ'లో జడ్జ్‌గా చేయడం వల్ల నందిత అంటే టీవీ అనే ముద్ర పడింది. అది పోవాలన్నా... ప్రస్తుతం చేతిలో ఉన్నవి కాకుండా మరిన్ని సినిమా ఛాన్సులు రావాలన్నా 'జెట్టి'తో నందిత సక్సెస్ అందుకోవాలి. అదీ సంగతి!


Also Read : ఈ వారం చిన్న సినిమాలదే హవా - థియేట్రికల్, ఓటీటీ రిలీజెస్ ఇవే!


ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నవీన్ చంద్ర 'తగ్గేదే లే' సినిమాలో నటించిన అనన్యా సేన్ గుప్తా, దివ్యా పెళ్ళై... 'బనారస్'లో హీరోయిన్ సోనాల్‌కు కూడా సక్సెస్ అవసరమే. ప్రేక్షకులకు ఈ శుక్రవారం ఎక్కువ ఆప్షన్స్ ఉండటంతో ఏ సినిమాను హిట్ చేస్తారో చూడాలి.