థియేటర్లలో సమంత 'యశోద' సందడి కొనసాగుతోంది. గత శుక్రవారం విడుదలైన ఆ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. మరి, ఈ శుక్రవారం సంగతి ఏంటి? అంటే... డిఫరెంట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. హీరో హీరోయిన్లు, బడ్జెట్ వంటివి చూసుకుంటే... చిన్న సినిమాలు కావచ్చు. కానీ, కంటెంట్ పరంగా చూస్తే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. అసలు, ఈ వారం థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయిన తెలుగు, హిందీ సినిమాలు ఏవో చూడండి. 


మసూద... మాంచి హారర్!
హారర్ కామెడీ సినిమాలు ఎక్కువైన తరుణంలో... తెలుగు ప్రేక్షకులకు హారర్ థ్రిల్ ఇవ్వడానికి వస్తున్న సినిమా 'మసూద' (Masooda Movie). ఆల్రెడీ రిలీజైన ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించింది. ఓ ముస్లిం అమ్మాయికి దెయ్యం పడుతుంది. దాన్ని వదిలించడానికి క్షుద్రపూజలు చేయాలని, అమ్మాయితో రక్త సంబంధం ఉన్న ఇద్దరు మగవాళ్ళ రక్తం కావాలని పూజ చేయించే వ్యక్తి చెబుతారు. రక్తం ఇచ్చారా? లేదా? అమ్మాయి నివసించే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కృష్ణ అనే వ్యక్తి ఎలాంటి సాయం చేశాడు? అనేది కథగా తెలుస్తోంది. ఇంకా చాలా అంశాలు రివీల్ చేయలేదని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 



సంగీత ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. 'మళ్ళీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తర్వాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన చిత్రమిది. శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. 


'సుడిగాలి' సుధీర్... 'గాలోడు'
తెలుగు బుల్లితెర స్టార్ 'సుడిగాలి' సుధీర్ (Sudigali Sudheer) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గాలోడు' (Gaalodu Movie). మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పల్లెటూరి కుర్రాడు మాఫియా వరకు ఎలా వెళ్ళాడు? అనేది థియేటర్లలో చూడాలి. ఇందులో ఆకాష్ పూరి 'చోర్ బజార్'లో నటించిన గేహనా సిప్పి హీరోయిన్. సప్తగిరి కీలక పాత్ర చేశారు. 



తెలుగులో ఈ రెండూ కాకుండా 'అలిపిరికి అల్లంతదూరంలో', 'సీతారామపురంలో', 'బెస్ట్ కపుల్', 'భరత పుత్రులు', 'కామసూత్ర' చిత్రాలు కూడా థియేటర్లలో విడుదల అవుతున్నాయి. 


Also Read : త్రివిక్రమ్ - ప్రేక్షకుడితో నడిచే జీవితం, ఎప్పటికీ మరువలేని పుస్తకం!


రజనీకాంత్ మెచ్చిన సినిమా... లవ్ టుడే!
స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు ఈ వారం తమిళ డబ్బింగ్ సినిమా 'లవ్ టుడే' (Love Today Telugu Release Date) కూడా ఈ శుక్రవారం (నవంబర్ 18న) విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించలేదు. ఆల్రెడీ తమిళంలో సినీ ప్రముఖులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుందీ సినిమా. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పిలిచి మరీ అతడిని అభినందించారు. 


హిందీలో 'మిస్టర్ మమ్మీ'...
పురుషుడికి ప్రెగ్నెన్సీ వస్తే?
రియల్ లైఫ్ కపుల్ రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా నటించిన హిందీ సినిమా 'మిస్టర్ మమ్మీ'. పురుషుడికి ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ఉంటుంది? అనేది కాన్సెప్ట్. కడుపులో బిడ్డను మూసే మగవాడిగా రితేష్ స్టైల్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా ఎలా ఉంటుందో శుక్రవారం చూడాలి.
 


మలయాళంలో, తెలుగులో హిట్ అయిన 'దృశ్యం 2' కథ ఇప్పుడు హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్ళింది. అజయ్ దేవగణ్, శ్రియ మరోసారి జంటగా నటించిన ఈ సినిమా కూడా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన 'కలగ తలైవన్', మలయాళంలో 'అదృశ్యం', కన్నడలో 'ఆవర్త' తదితర సినిమాలు శుక్రవారం విడుదల అవుతున్నాయి.   


Also Read : కాషాయ జెండా కడుతున్న బాలీవుడ్ - సక్సెస్ కోసం హిందుత్వ సిద్ధాంతాన్నే నమ్ముకుంటోందా?