ఎట్టకేలకు 'మా' ఎన్నికల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. గత కొంతకాలం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఎన్నికల కారణంగా తీవ్ర గందరగోళం నెలకొంటుంది. 'మా' క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజు నేతృత్వంలో ఆన్ లైన్ ద్వారా 'మా' కార్యవర్గం సమావేశం జరిగింది. సీనియర్ నటులు మురళీమోహన్, మోహన్ బాబు, శివకృష్ణలతో మా అధ్యక్ష కార్యదర్శులతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు ఆన్ లైన్‌లో సమావేశమయ్యారు. మా అసోసియేషన్‌లో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు, గత కార్యవర్గంలో సభ్యుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలపై సుమారు 2 గంటలపాటు చర్చించారు. ఆగస్టు 22న 'మా' జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 



సెప్టెంబర్ 12న అధ్యక్ష ఎన్నికలు జరపాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల కార్యవర్గ సభ్యుల పదవీకాలం పూర్తికాకముందే అధ్యక్ష పదవికి సిద్ధమంటూ పలువురు ప్రకటించారు. దీంతో 'మా' అసోసియేషన్‌లో వేడి రాజుకుంది. తాజాగా 'మా' కార్యవర్గ పదవీకాలం ముగిసింది. దీంతో కార్యవర్గ సభ్యులు 'మా' క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజుకి లేఖ రాశారు. ప్రస్తుతం కార్యవర్గం పదవీకాలం ముగిసిందని.. ఎన్నికలు నిర్వహించాలని ఆ లేఖలో కోరారు. కార్యవర్గ సభ్యుల ప్రతిపాదనలపై కృష్ణంరాజు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉండగా.. 'మా' అధ్యక్ష పదవి కోసం ఈసారి చాలా మంది పోటీ పడుతున్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎవరికి వాళ్లు ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటూ.. సీనియర్ల నుండి మద్దతుని కూడగట్టే పనిలో పడ్డారు. అయితే ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని పలువురు సీనియర్ సభ్యులు పావులు కదుపుతున్నారు. పెద్దలందరూ కలిసి ఒకర్ని అధ్యక్షుడిగా ఒకరిని ఎన్నుకుంటే తనకు సమ్మతమేనని ఇటీవల మంచు విష్ణు చెప్పారు. 


కానీ ఈ ఏకగ్రీవం కాన్సెప్ట్‌పై మిగిలిన పోటీదారులెవరూ స్పందించలేదు. ప్రకాష్ రాజ్‌కి మెగాఫ్యామిలీ సపోర్ట్ ఉందని తెలుస్తోంది. కాబట్టి చిరంజీవి, నాగబాబు రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది. జీవితా రాజశేఖర్‌కి ఉన్న ఫాలోయింగ్‌ను చూస్తే ఆమె నుండి మిగిలిన వారికి ఆమె గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. హేమ, సీవీఎల్ నరసింహారావు ఈ పోటీ నుండి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌ల మధ్య కాంపిటిషన్ తారాస్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. ఆగస్టు 22న జరగనున్న జనరల్‌ బాడీ సమావేశం తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.