మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'గాడ్ ఫాదర్' సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు. దీంతో పాటు చిన్న టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా బాగా వైరల్ అయింది. మెగాఫ్యాన్స్ అయితే మెగాస్టార్ లుక్ కి ఫిదా అయిపోయారు. కానీ కొందరు మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ చూసిన కొందరు.. అలానే కేరళకి చెందిన కొందరు మోహన్ లాల్ ఫ్యాన్స్ చిరంజీవి లుక్ ని ట్రోల్ చేస్తున్నారు.
దయచేసి 'లూసిఫర్' సినిమాను రీమేక్ చేయొద్దని.. మోహన్ లాల్ క్లాసిక్ సినిమాను చెడగొట్టొదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మోహన్ లాల్ పెర్ఫార్మన్స్ ను ఎవరూ మ్యాచ్ చేయలేరని.. రీప్లేస్మెంట్ అనేదే ఉందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి స్టైల్ కి ఈ సినిమా సూట్ అవ్వదని మరికొందరు అంటున్నారు. నిజానికి ఏదైనా సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ రావడం చాలా కామన్.
మాతృకతో రీమేక్ ను పోల్చుతూ దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. అదే రీమేక్ హిట్ అయితే అంతా సైలెంట్ అయిపోతారు. గతంలో కూడా చిరంజీవి రీమేక్ సినిమాల్లో నటించారు. ఆయన రీఎంట్రీ సినిమా కూడా రీమేకే. అది ఏ రేంజ్ లో హిట్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్', 'భీమ్లానాయక్' రెండూ కూడా రీమేక్ సినిమాలే. 'అయ్యప్పనుమ్ కోశియుమ్' లాంటి క్లాసిక్ సినిమాను పవన్ రీమేక్ చేస్తున్నారంటూ ఆయనపై ఓ రేంజ్ లో మండిపడ్డారు.
కానీ తీరా రిజల్ట్ చూస్తే ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఆ సినిమా. ఎంత రీమేక్ కథ అయినప్పటికీ.. తెలుగు ఆడియన్స్ కి తగ్గట్లు మార్పులు, చేర్పులు చేస్తారు మన దర్శకనిర్మాతలు. చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమా విషయంలో కూడా ఇదే ఫాలో అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. దసరా కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా విమర్శలకు నోళ్లు మూయిస్తుందేమో చూడాలి!