Mohan Babu was admitted in Hospital:  మీడియాపై, కుమారుడు మనోజ్ పై దాడి చేసిన మోహన్ బాబు బీపీ పెరిగిపోవడంతో ఆస్పత్రిలో చేరారు. మంచు విష్ణు ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. మరో వైపు రాచకొండ పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన బుధవారం ఉదయం పదొకండు గంటలకు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. మరో వైపు మంచు మోహన్ బాబు అరెస్టు  భయంతోనే  బీపీ పెరిగిందని చెప్పి ఆస్పత్రిలో చేరారన్న ఆరోపణలు వస్తున్నారు. అంతకు ముందు మోహన్ బాబు భార్య నిర్మల కూడా ఆస్పత్రిలో చేరారు. 


అంతకు ముందు మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదం తీవ్ర స్థాయికి చేరింది. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడులు చేశారు.  మంచు మనోజ్ దంపతులు ఇంటికి వెళ్లే సరికి గేట్ వేసి ఉంది. సెక్యూరిటీ సిబ్బంది గేటు తీసేందుకు నిరాకరించారు. దాంతో గేటు తోసేసుకుని ఆయన  లోపలికి వెళ్లిపోయారు. దీంతో ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.  ఉదయం మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే మనోజ్ తో పాటు ఆయన భార్య, బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపేసి గేట్లు వేసేశారు. 


Also Read: భార్య మాటలు విని గుండెల మీద తన్నావు - నా ఆస్తి నా ఇష్టం - మనోజ్‌కు తేల్చి చెప్పిన మోహన్ బాబు


ఆ తర్వాత మంచు మనోజ్ తనకు భద్రత కల్పించాలని పోలీసుల్ని కోరేందుకు వెళ్లారు. ఇంటలిజెన్స్ డీజీ, డీజీపీతో పాటు రాచకొండ కమిషనర్ ను కలిసి తమ కుటుబంంలో వివాదాల గురించి, తనపై జరిగిన దాడుల గురించి ఫిర్యాదు చేసి రక్షణ కల్పించాలని కోరారు. ఆ తర్వాత నేరుగా ఆయన జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వచ్చారు.  అయితే అప్పటికే మనోజ్ కు సంబంధించిన సామాన్లను మోహన్ బాబు నాలుగు వాహనాల్లో బయటకు పంపేందుకు మోహన్ బాబు ఏర్పాట్లు చేశారు. మరో వైపు మనోజ్ ను ఇంట్లోకి అనుమతించవద్దని సెక్యూరిటీకి చెప్పారు. దాదాపుగా యాభై మంది బౌన్సర్లను మోహరించారు. అయితే మోహన్ బాబు ఇంట్లోకి మనోజ్ వెళ్లేందుకు  ప్రయత్నించారు. గేటు తీయకపోవడంతో గట్టిగా తోసేసుకుని ఆయన లోపలికి వెళ్లారు. ఆయనతో పాటు భార్య మౌనిక.. కొంత మంది సన్నిహితులు కూడా వెళ్లారు.   


       


Also Read:  ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?


మీడియాపై మోహన్ బాబు దాడి చేయడం సంచలనంగా మారింది. ఓ టీవీ చానల్ ప్రతినిధి మైక్ లాక్కుని ఆయనపై దాడి చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి చేస్తున్న సమయంలో పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. మంచు మనోజ్ పైనా దాడి చేసి బయటకు పంపించారు. చివరికి ఈ విషయం పలు రకాల కేసులు నమోదుకు కారణమయ్యే అవకాశం ఉంది.