Mohan Babu released an audio expressing his anger on Manchu Manoj: మనోజ్‌ను ఉద్దేశించి ఆడియో రిలీజ్ చేసిన మోహన్‌బాబు.. అందులో సంచలన ఆరోపణలు చేశారు. మనోజ్.. నిన్ను అల్లారుముద్దుగా పెంచానని.. చదువు కోసం చాలా ఖర్చు పెట్టాననని గుర్తు చేశారు. భార్య మాటలు విని మనోజ్ నా గుండెలపై తన్నావ్ అని ఆడియోలో మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాగుడుకు అలవాటుకు పడి చెడు మార్గంలో వెళ్తున్నావని.. కొన్ని కారణాల వల్ల ఇద్దరు ఘర్షణ పడ్డామన్నారు. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయన్నారు.
ఇంట్లో ఉన్న అందరినీ ఎందుకు కొడుతున్నావని మోహన్ బాబు ప్రశ్నించారు. బతుకుదెరువు కోసం వచ్చిన పనివాళ్లను కొట్టడం మహాపాపమన్నారు. నీ దాడిలో కొందరికి గాయాలయ్యాయి, అయినా కాపాడాననన్నారు. విద్యాసంస్థల్లో ప్రతీది లీగల్‌గా ఉంది, తప్పులు ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు. అన్నతో పాటు వినయ్‌ను కొట్టడానికి వచ్చావు. నీ అన్నను చంపుతానని అన్నావని ఆరోపించారు. నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదని స్పష్టం చేశారు. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లని తేల్చి చెప్పారు.
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
రోడ్డుకెక్కి నా పరువు తీశావవని మోహన్ బాబు మండిపడ్డారు. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా.. వద్దా అనేది నా ఇష్టమని మోహన్‌బాబు స్పష్టం చేశారు. 0పిల్లలకు ఇస్తానా.. దానధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టమని .. మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు, అయినా నేను సంపాదించుకున్నానని మోహన్ బాబు తెలిపారు. మనోజ్ నన్ను కొట్టలేదు, మేమిద్దరం ఘర్షణ పడ్డామని.. నా ఇంట్లోకి నువ్వే అక్రమంగా చొరబడ్డావ్, నా మనుషులను కొట్టావ్ అని మోహన్ బాబు స్పష్టం చేశారు. నాకు రక్షణ కావాలని పోలీసులను కోరానన్నారు.
మళ్లీ తప్పు చేయనని చెప్పి ఇంట్లోకి వచ్చావని.. నీకు జన్మనివ్వడమేనా నేను చేసిన పాపం అని మోహన్ బాబు ప్రశ్నించారు. మంచు మనోజ్ కుమార్తె ఇంట్లోనే ఉంది. నీ కూతురును వచ్చి తీసుకెళ్లు, నా దగ్గర వదిలిపెట్టినా ఇబ్బంది లేదని మోహన్‌బాబు తెలిపారు. జరిగిన సంఘటనతో మీ అమ్మ ఆస్పత్రిలో చేరిందన్నారు. పోలీసుల సమక్షంలోనే నీ బిడ్డను నీకు అప్పగిస్తానన్నారు. మోహన్ బాబు ఆడియో వైరల్ గా మారింది.
కుమారుడు పోలీసుల వద్దకు వెళ్లిన సమయంలో ఆయనను ఉద్దేశించి మోహన్ బాబు ఈ ఆడియో రిలీజ్ చేశారు. అయితే ఆ తర్వాత మనోజ్ ఇంటికి రావడంతో పెద్ద గొడవ జరిగింది. మీడియాపై కూడా మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. మనోజ్ పై కూడా బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు.