Keeravani Interesting Comments About Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కలిసి పలు సినిమాలు చేశారు. వీరిద్దరి కలయికలో ‘ఘరానా మొగుడు’, ‘ఆపద్బాంధవుడు’, ‘ఎస్‌.పి.పరశురామ్‌’ లాంటి హిట్ సినిమాలు చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాల్లోని పాటలు ప్రేక్షకులను ఊర్రూతలూగించాయి. ఇప్పటికీ ఆ మూవీస్ లోని పాటలను సంగీత ప్రియులు బాగా ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి చిత్రాలకు కీరవాణి ఇచ్చే సంగీతం కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించారు కీరవాణి.


చిరంజీవి ఆ ట్యూన్ మార్చమన్నారు- కీరవాణి


సంక్రాంతి కానుకగా ‘నా సామిరంగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగార్జున. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా వచ్చారు నాగార్జున, కీరవాణిని పాటల రచయిత చంద్రబోస్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా నాగార్జునతో పాటు చిరంజీవి మ్యూజిక్ సెన్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “నాగార్జున, చిరంజీవికి మ్యూజిక్ సెన్స్ ఎక్కువ. ఒక్కోసారి కంపోజింగ్ దగ్గర కూర్చొని మాకు ఇలా కావాలి, అలా కావాలి అని అడిగేవారు. వాళ్లు అడిగే విధానం ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ను ఇబ్బంది పెట్టేలా ఉండదు. ఇలా కావాలి అని అడగడమే కాదు, ఎందుకు కావాలి? అనే విషయాన్ని చెప్తారు. మ్యూజిక్ చేసే వాళ్లు ఉత్సాహం కలిగేలా వ్యవహరిస్తారు. ‘ఘరానా మొగుడు’ సినిమా సమయంలో ‘బంగారు కోడిపెట్ట’ పాట చేస్తున్నాం. ముందు నేను ఓ ట్యూన్ చేశాను. ఇది స్టెప్స్ కు అనుకూలంగా లేదండీ, ఇలా మార్పులు చేయండి అన్నారు చిరంజీవి. ఎలా చేయాలో ఎక్స్ ప్లెయిన్ చేశారు. ఆయన చెప్పినట్లే చేశాం. మంచి సక్సెస్ అందుకుంది. మ్యూజిక్ ను ప్రేమించి, నచ్చినట్టుగా చేయించుకోవడంలో నాగార్జున, చిరంజీవి ముందుంటారు” అని చెప్పారు.  


విశిష్టతో మూవీ చేస్తున్న చిరంజీవి


చిరంజీవి ఇటీవల ‘వాల్తేరు వీరయ్య‘ సినిమాలో కనిపించారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రవితేజ, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు వశిష్టతో సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో పాన్ ఇండియా రేంజిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సుమారు రూ. 200 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రబృందం ఆమెతో చర్చించినట్లు సమాచారం. దీపిక కూడా ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Read Also: రామ్ చరణ్ దంపతులకు అయోధ్య ఆహ్వానం, ఇంటికి వచ్చి ఆహ్వానించిన ఆర్ఎస్ఎస్ సభ్యులు