సౌత్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’. మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది.


అమెరికాలో మిలియన్ డాలర్లు దాటిన వసూళ్లు


ఇక అగ్రరాజ్యం అమెరికాలోనూ ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’  దుమ్మురేపుతోంది. ఈ చిత్రాన్ని చూసేందుకు ఎన్నారైలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. చాలా థియేటర్లు ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులను పెడుతున్నాయి. కలెక్షన్ల విషయంలో ఈ మూవీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు అమెరికాలో ఈ చిత్రం మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది.






హాట్రిక్ హిట్ అందుకున్న నవీన్ పొలిశెట్టి


‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది.  వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు తొలి షో నుంచే అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. ఈ చిత్రంలో కామెడీ అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు, ఇటీవల తెలుగులో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా నిలిచింది.  కథాంశం చిన్నదే అయినా, కామెడీ అందరినీ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నవీన్ నటనను అందరూ మెచ్చుకున్నారు. ఈ సినిమాలో అనుష్కతో పోల్చితే నవీన్ నటనే అద్బుతంగా అలరించింది.  మొత్తంగా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు.  


అందం, అభినయంతో ఆకట్టుకున్న అనుష్క


ఇక  అనుష్క కెరీర్ లో 48వ చిత్రంగా ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ వచ్చింది.  'నిశ్శబ్దం' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆమె ఈ సినిమాలో నటించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది.  సీనియర్ హీరోయిన్ - యంగ్ హీరో కలిసి నటించిన ఈ చిత్రం  చక్కటి  సక్సెస్ అందుకుంది. ఇందులో జయసుధ, నాజర్, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తి, అభినవ్ గోమటం తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాకి రధన్ సంగీతం అందించారు.


‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ చిత్రంపై ప్రముఖుల ప్రశంసలు


అటు ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. దర్శకధీరుడు రాజమౌళి, అందాల నటి సమంత మెచ్చుకున్నారు. మూవీ టీమ్ ను  అభినందిస్తూసోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నట్లు సమంత వెల్లడించింది. చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ను చాలా సరదాగా, వినోదాత్మకంగా తెరకెక్కించిన దర్శకుడు మహేష్ కు అభినందనలు అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.   


Read Also: ‘సంయుక్త’కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్- ‘డెవిల్’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial