'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో స్వరూప్ ఆర్.ఎస్.జె తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి తాప్సీ ప‌న్ను అంగీకరించిన సంగతి తెలిసిందే. అదే 'మిషన్ ఇంపాజిబుల్'. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఇది. ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలియజేసింది.


వేసవి కానుకగా ఏప్రిల్ 1న 'మిషన్ ఇంపాజిబుల్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాప్సీతో పాటు సినిమాలో మరో ముగ్గురు బాలలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. దావూద్ ని పట్టుకుంటే ప్రభుత్వం రూ.50 లక్షలు ఇస్తుందని పేపర్ లో చదివిన ముగ్గురు పిల్లలు డబ్బు కోసం దావూద్ ని వెతకడానికి బయలుదేరతారు. అలాంటి వారిని తన మిషన్ కోసం వాడుకుందామని ఫిక్స్ అవుతుంది తాప్సీ. ఇంతకీ ఆ మిషన్ ఏంటి..? ఆ ముగ్గురు పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనేదే సినిమా.  


తిరుపతికి సమీపంలోని ఓ మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంతో సినిమా రూపొందించినట్టు చిత్ర బృందం పేర్కొంది. రవీందర్ విజయ్, హరీష్ పరేది తదితరులు నటించిన ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తుండగా... ఎన్.ఎం. పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా, సంగీతం: మార్క్ కె రాబిన్. ఎడిటర్ రవితేజ గిరిజాల.


Also Read: 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై మోదీ కీలక వ్యాఖ్యలు- ఏమన్నారో తెలుసా?