ప్రస్తుతం ఎక్కడ చూసినా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మార్చి 11న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రధాని మోదీ కూడా ఈ సినిమాను చూసి చిత్రబృందాన్ని అభినందించారు. దీంతో సినిమా మరింత పాపులారిటీ తెచ్చుకుంది. 90వ దశకంలో కశ్మీర్ పండిట్ లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ లు కీలకపాత్రలు పోషించారు.


హర్యానా, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు ఈ సినిమాకి పన్ను మినహాయింపును కూడా ప్రకటించాయి. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ సినిమాకి రివ్యూ ఇచ్చింది. ఆమె హోస్ట్ చేస్తోన్న రియాలిటీ షో 'లాకప్'లో ఈ సినిమా గురించి మాట్లాడింది. సినిమా దర్శకనిర్మాతలను పొగుడుతూ.. సినీ పరిశ్రమ పాపాలను వారు కడిగేశారని చెప్పింది. బాలీవుడ్ చేసిన పాపాలను కూడా ప్రక్షాళన చేశారని చెప్పింది. 


'కశ్మీర్ ఫైల్స్'ను ఎంతో గొప్పగా చూపించారని.. పరిశ్రమలో ఎలుకల్లా దాక్కున్న వారు బయటకు వచ్చి ఈ సినిమాను ప్రోత్సహించాలని చెప్పింది. పనికిరాని సినిమాలను ప్రోత్సహించడం మానేసి ఇలాంటి గొప్ప కథలకు మద్దతుగా నిలవాలని చెప్పుకొచ్చింది. గతవారం కూడా కంగనా ఈ సినిమా గురించి మాట్లాడింది. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో సక్సెస్ ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ సినిమాగా 'కశ్మీర్ ఫైల్స్' పేరు చెప్పింది. 


ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే.. కశ్మీర్ లోయలోని హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలలను వివస్త్రలుగా చేసి.. సామూహిక మానభంగం చేశారు. ఆ లోయలో ఉండాలంటే ముస్లింలుగా మతం మార్చుకోవాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించారు. తమకు ఎదురు తిరిగినవారిని చంపేశారు. వారు ఆస్తులను దోచుకున్నారు. 


తుపాకులు, కత్తులతో హిందువులపై దాడి చేశారు. అప్పటివరకు తమతో కలిసి ఉన్న ముస్లిం సోదరులు తమను చంపడానికి ప్రయత్నించడం పండిట్ లను విస్మయానికి గురిచేసింది. దాదాపు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్ లు స్వదేశంలోనే శరణార్థులుగా మారారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. అప్పట్లో జరిగిన ఈ మారణకాండకు కేంద్రంలో ఉన్న ఓ మంత్రి సాయం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.