సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'మైఖేల్'. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.  ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నారు. ఫిబ్రవరి 3న 'మైఖేల్' చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై  ఈ చిత్రాన్ని నిర్మిస్తు్న్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. రంజిత్ జయకోడి ఈ చిత్రానికి దర్శకుడు.


‘మైఖేల్’ టీజర్‌కు మంచి రెస్పాన్స్


గతేడాది డిసెంబరు 10న విడుదలైన 'మైఖేల్' టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల సినిమాలో తొలి పాట 'నువ్వుంటే చాలు' పాటకు కూడా రెస్పాన్స్ అదిరింది. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. టీజర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో సాగే కథలా ఉంది. విజువల్స్ లో కూడా ఓ కొత్తదనం కనబడుతోంది. డైలాగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అదిరిపోయాయి. టీజర్ మధ్యలో వచ్చిన డైలాగ్ ఓ రేంజ్ లో ఉంది. ‘‘మైఖేల్.. వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయ్’’ అనే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. దానికి హీరో బదులు చెప్తూ.. ‘‘వెంటాడి ఆకలి తీర్చుకోడానికి.. వేటాడటం తెలియల్సిన పనిలేదు మాస్టార్’’ అని అంటాడు. అలాగే టీజర్ చివరలో ‘‘మన్నించేటప్పుడు మనం దేవుడవుతాం మైఖేల్’’ అనే డైలాగ్ కు కూడా హీరో బదులిస్తూ ‘‘నేను మనిషిగానే ఉంటా మాస్టార్’’ అని అంటాడు. ఈ డైలాగ్స్ సినిమా పై మరింత ఆసక్తి పెంచేలా ఉన్నాయి. ఈ చిత్రానికి మాటలు : త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె సాంబశివరావు, ఛాయాగ్రహణం : కిరణ్ కౌశిక్,  సంగీతం : సామ్ సిఎస్, సమర్పణ : నారాయణ్ దాస్ కె. నారంగ్, నిర్మాతలు : భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు. 


మ్యాడ్ క్వీన్‌గా అనసూయ




'మైఖేల్' సినిమాలో 'హ్యాపీ డేస్' ఫేమ్ వరుణ్ సందేశ్, స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఉన్నారు. బుధవారం అనసూయ పాత్రను ‘మ్యాడ్ క్వీన్’గా పరిచయం చేశారు. ఇందులో అనసూయ బ్లాక్ శారీలో చాలా సీరియస్‌గా కనిపిస్తోంది. చూస్తుంటే.. అనసూయ కూడా విలన్ కావచ్చని తెలుస్తోంది. 


ప్రభుదేవ మూవీ ‘Wolf’లో చారులతగా అనసూయ




ప్రభుదేవ తమిళంలో నిర్మిస్తున్న ‘వోల్ఫ్’ మూవీలో కూడా అనసూయ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో అనసూయ చారులత పాత్రలో కనిపించనుంది. ఇది ప్రభుదేవాకు 60వ చిత్రం. WOLF మూవీకి వినూ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. హర్రర్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ మూవీగా ‘వోల్ఫో’ను తెరకెక్కిస్తున్నారు. ‘మైఖెల్’, ‘వోల్ఫ్’ మూవీస్ కూడా హిట్ కొడితే.. అనసూయ తమిళంలో కూడా బిజీ స్టార్‌గా మారిపోవచ్చు. 



Also Read: ‘వారిసు’ కోసం విజయ్‌కు భారీ రెమ్యునరేషన్, రష్మికాకు ఎంతిచ్చారో తెలుసా?